అబ్ద్-రు-షిన్ ఎవరు?

Abd-ru-shin_02

„సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథ రచయిత అబ్ద్-రు-షిన్ పౌరనామము ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్. జర్మనీ దేశస్తుడైయుండిన అతడు 18 ఏప్రిల్ 1875న (డ్రెస్‌డెన్ నగర సమీపంలోని) బిషోఫ్స్‌-వెర్ద లో జన్మించాడు. అబ్ద్-రు-షిన్ అనే పేరుతో అతడు తన „గ్రాలుసందేశము“ కొరకు ఉపన్యాసలను వ్రాసాడు. ఆ పేరు యొక్క భావార్థం „వెలుగు యొక్క సేవకుడు“.

1928లో ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్ ఆస్త్రియా దేశానికి తరలిపోయాడు. జాతీయ సామ్యవాదులు అతని ఆస్తిని స్వాధీనం చేసుకొని „సత్యము యొక్క వెలుగులో“ గ్రంథాన్ని నిషేధించేంతవరకు అతడు అక్కడ నివసించాడు. తన కార్యంలో నిరోధించబడి అబ్ద్-రు-షిన్ 6 డిసెంబరు 1941న సాక్సొనీలోని ఎర్జ్ పర్వతశ్రేణిలో ఉన్న ఓబర్‌-కిప్స్‌-డోర్ఫ్‌ లో మరణించాడు. అతని జీవితంలోని చివరి సంవత్సరాలను అతడు గెస్టాపొ-పర్యవేక్షణ క్రింద గడపవలసివచ్చింది.

బిషోఫ్స్‌-వెర్దలో సాగిన ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్ యొక్క బాల్యం సంతోషకరంగా ఉండింది. పాఠశాల అనంతర వాణిజ్య విద్యాభ్యాసమును మరియు తర్ఫీదును అతడు డ్రెస్‌డెన్‌ నగరంలో ముగించాడు.

బిషోఫ్స్‌-వెర్ద లోని గాంబ్రినస్ అనే పేరుగల ఇల్లు అబ్ద్-రు-షిన్ (ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్) యొక్క పుట్టిన ఇల్లు.

స్వతంత్ర వ్యాపారవేత్తగా మరియు ఆ తరువాత పెద్ద ఎగుమతి మరియు దిగుమతుల వ్యాపారసంస్థలలో భాగస్తునిగా ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్ చాలా ప్రయాణించాడు. అతని అనుభవాలు మరియు జ్ఞాపకములు త్వరలోనే అతన్ని తన వాణిజ్య వృత్తిని వదిలి రచయితగా మారుటకు ప్రోత్సాహించాయి. 1907/08వ సంవత్సరం నుండి అతడు కేవలం రచయితగానే పనిచేసాడు. పర్యాటక కథలు మరియు నవలలతోనే కాక అతడు నాటక రచయితగా గణనీయమైన సఫలతను పొందాడు.

న్యూయార్కులో అతని దీర్ఘ నివాసాన్ని (1912/13) ఇంగ్లాడు (లండన్) దిశగా ఒక అధ్యయన పర్యటన అనుసరించింది. అప్పటికి నలభై సంవత్సరాల వయస్కుడైన ఆ జర్మన్ పౌరుడు, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత 1915 నుండి 1919 వరకు బ్రిటీషువారి „ఐల్ ఆఫ్ మాన్“ నిర్బంధస్థావరంలో బందీగా ఉంచబడ్డాడు. ఆ నాలుగు సంవత్సరాల నిర్బంధం అతనికి, పతనమయ్యే పాత ప్రపంచక్రమాల యొక్క అస్తవ్యస్థతలోనుండి ఎటువంటి మార్గాన్ని కనుగొనలేకపోయిన మనుష్యుల అంతరంగిక క్షోభను కలిసి అనుభవించుటకు అవకాశాన్ని ఇచ్చింది. ఇక్కడ, విషయాల వెనుక ఉన్న నిర్ణయాత్మకమైన ఉన్నతమైన అవినాభావ సంబంధాల గురించిన జ్ఞానం ద్వారా సహాయం చేయవలెననే కోరిక అతనిలో కలిగింది.

అందువల్ల ఓస్కార్ ఎర్న్‌-స్ట్ బెర్న్‌-హార్డ్ 1923వ సంవత్సరం నుండి ప్రధానమైన జీవితప్రశ్నలపై ఉపన్యాసాలను అబ్ద్-రు-షిన్ అనే పేరుతో ప్రచురించుటకు ప్రారంభించాడు. అబ్ద్-రు-షిన్ అనే పేరు కేవలం తన సద్భావ కార్యంగా అతడు గుర్తించిన మరియు జీవించిన దానిని – వెలుగు సేవకుడైయుండుటను – మాత్రమే వ్యక్తపరచలేదు కాని అది అతని మొదటి, సిద్ధపాటు నిమిత్తం మోషే కాలంలోని అతని భూలోకజీవితాన్ని „గ్రాలుసందేశ“ మాధ్యమికునితో జోడించింది. పునర్జన్మ బోధ „సత్యము యొక్క వెలుగులో“ అనే గ్రంథం యొక్క ప్రధానమైన భాగమైయున్నది.

1928లో అబ్ద్-రు-షిన్ తిరోల్ రాష్ట్రంలో, ఇన్స్‌-బ్రుక్ పట్టణ సమీపంలో ఉన్న ఫొంపర్‌బెర్గ్‌ లో స్థిరపడ్డాడు మరియు అక్కడే, నేడు కూడా అందుబాటులో ఉన్న „గ్రాలుసందేశం“ మూడు సంపుటాల ప్రచురణలోని ఉపన్యాసాలను సంపూర్ణంచేసాడు. అదే చోట గ్రాలుసందేశ అనుయాయులు కూడా స్థిరపడడంతో అక్కడ „గ్రాలు-గ్రామము“ ఏర్పడింది మరియు దానితోపాటు ఆ సందేశానుసారమైన జీవనశైలి ప్రారంభమయింది. కాని 1938లో ఆస్ట్రియా దేశం „జర్మనీలో“ భాగమైనప్పుడు నాజీ పాలకులు దాని వ్యాప్తిని నిషేధించారు. అబ్ద్-రు-షిన్ నిర్బంధించబడ్డాడు మరియు ఫొంపర్‌బెర్గ్ (పర్వతం) పై ఉన్న అతని ఆస్థి స్వాధీనంచేసుకోబడింది.

ఇన్స్‌-బ్రుక్ లో ఆరునెలల భారమైన నిర్బంధం అనంతరం, స్వాధీనం చేసుకోబడిన ఆస్ట్రియా దేశాన్ని అతడు వదిలివేయవలసివచ్చింది. చివరకు అతడు సాక్సొనీలోని ఎర్జ్ పర్వతశ్రేణిలో ఉన్న ఓబర్‌-కిప్స్‌-డోర్ఫ్‌ లో ఒక వసతిని కనుగొన్నాడు. అయితే అతడు, తన కార్యం నిమిత్తం బహిరంగ కార్యక్రమాలు చేయుటనుండి మరియు సందర్శకులను కలయుటనుండి నిషేధించబడ్డాడు. గెస్టాపొ అబ్ద్-రు-షిన్‌ను నిరంతరం పర్యవేక్షించింది మరియు నియంత్రించింది.

ఆ నిర్బంధ సంవత్సరాలను అతడు తన కార్యం కొరకు ఉపయోగించాడు: గ్రాలుసందేశాన్ని అతడు నేడు అది మన ఎదుటవున్న రూపంలోనికి మార్చాడు. కాని నిర్బంధం మరియు బలవంతమైన ఏకాంతవాసాల పర్యవసానంగా అబ్ద్-రు-షిన్ కేవలం 66 సంవత్సరాల వయస్సులోనే 6 డిసెంబరు 1941న కిప్స్‌-డోర్ఫ్‌ లో మరణించాడు.