మేల్కొనండి!

మనుష్యులారా, మీ మొద్దు నిద్రనుండి మేల్కొనండి! మీరు మోయుచున్న, వర్ణనాతీతమైన సడలని వత్తిడితో మిలియన్ల మంది మనుష్యులపై మోపబడియున్న, అయోగ్యమైన భారమును గుర్తించండి. దానిని పడవేయండి! అది మోయుటకు యోగ్యమైనదా? ఒక్క క్షణకాలంపాటు కూడా కాదు!

దానిలో ఏమి ఉన్నది? సత్యం యొక్క శ్వాస ఎదుట పిరికిగా ఎగిరిపోయే ఖాళీ పొట్టు. మీరు సమయాన్ని మరియు శక్తిని ఎటువంటి ప్రయోజనం లేకుండానే వృధా చేశారు. అందువల్ల మిమ్ములను అణచియుంచే గొలుసులను తెంపివేయండి, మిమ్ములను ఎట్టకేలకు స్వతింత్రించుకోండి!

ఏ మనిషి అంతరంగంలో బంధించబడియుంటాడో అతడు, ఒకవేళ రాజైయున్నా కూడా నిరంతరం బానిసైయుంటాడు.

మీరు నేర్చుకొనుటకు కాంక్షించే వాటన్నింటితో మిమ్ములను మీరు బంధించుకొంటారు. ఆలోచించండి: నేర్చుకొనుట ద్వారా మీరు ఇతరులు ఆలోచించిన అన్యమైన రూపాలలోనికి మిమ్ములను బలవంతపెట్టుకొంటారు, ఇష్టపూర్వకంగా ఏదో ఒక అన్యమైన ఒప్పుదలతో ఏకీభవిస్తారు. ఇతరులు తమలో, తమ కొరకై అనుభవించిన దానిని మాత్రమే మీ స్వంతం చేసుకొంటారు.

ఆలోచించండి: ప్రతియొక్కటీ అందరికి పనికిరాదు. ఒకరికి ఉపయోగకరమైనది, ఇంకొకరికి నష్త్టమును కలిగించవచ్చు. ప్రతి ఒక్కడూ పరిపూర్ణతకు తన స్వంత మార్గాన పోవలసి ఉంటుంది. అతడు తనలో కలిగియున్న సామర్థ్యాలే దానికొరకు అతని ఆయుధసామాగ్రి. వాటికి అనుగుణంగా అతడు వ్యవహరించాలి, వాటి ఆధారంగా నిర్మించుటకు. అట్లు చేయని పక్షంలో అతడు, తనయందు తానే అన్యుడైయుంటాడు, ఎల్లప్పుడు తాను అభ్యసించిన దాని ప్రక్కన నిలిచియుంటాడు, అది అతనిలో ఏనాటికీ సజీవము కాలేదు. ప్రతి లాభము తద్వారా అతనికి పూర్తిగా అవరోధించబడుతుంది. అతడు క్రమంగా నిస్తేజమైన జీవనం కొనసాగిస్తూ కృషించిపోతాడు, అభివృద్ధి అసాధ్యమౌతుంది.

వెలుగుకొరకు మరియు సత్యముకొరకు ఆకాంక్షించే వారలారా, గుర్తించుకోండి:

సత్యమునకు మార్గమును ప్రతి వ్యక్తి తన అంతరంగంలో తప్పక అనుభవించవలసియుంటుంది, అతడు దానిపై సురక్షితంగా పోదలచుకొన్నట్లైతే, దానిని అతడే స్వయంగా కనిపెట్టవలసియుంటుంది. దేనిని మనిషి తనయందు అనుభవిస్తాడో, అన్ని వైవిద్యాలతో సహా అంతఃకరణంలో స్ఫురిస్తాడో, దానిని మాత్రమే అతడు సంపూర్ణంగా గ్రహించియుంటాడు!

దుఃఖము మరియు సంతోషము కూడా మనిషిని ఉత్తేజపరచుటకు, ఆత్మీయంగా మేల్కొల్పుటకు ఎల్లప్పూడూ తలుపు తట్టుతుంటాయి. మనిషి అప్పుడు అతితరచుగా కొన్ని క్షణాలపాటు ప్రతివిధమైన అనుదిన జీవితపు నిరర్థకములనుండి విముక్తి పొంది, సుఖంలోను అదే విధంగా బాధలోను, జీవించే సమస్తం ద్వారా ప్రవహించే ఆత్మతో, సూచనపూర్వకంగా అనుబంధానుభూతిని పొందుతాడు.

మరి సమస్తమూ జీవమే కదా, ఏదియూ నిర్జీవము కాదు! ఎవడైతే అటువంటి అనుబంధపు క్షణాలను సంగ్రహిస్తాడో మరియు భద్రపరచుకొంటాడో, వాటి ఆధారంగా ఉడ్డీనమౌతాడో, వాడు ధన్యుడు. అట్లు చేయునప్పుడు అతడు స్తబ్ధమైన రూపాలపై ఆధారపడరాదు, కాని ప్రతిఒక్కడు కూడా తన అంతరంగంలోనుండి తనను తాను అభివృద్ధి పరచుకొనవలెను.

ఆధ్యాత్మిక జీవితానికి ఇంకా అపరిచితులైయున్న పరిహాసకులను పట్టించుకోవద్దు. మనకు ఎంతో అనుగ్రహించుచున్న గొప్ప సృష్టికార్యము ఎదుట వారు త్రాగినవారివలే, రోగులవలే నిలిచియున్నారు. తడుముకుంటూ భూమిపై తమ మనుగడను వెళ్లబుచ్చుచున్న మరియు తమచుట్టూవున్న సమస్త వైభవాన్ని చూడకుండావున్న గ్రుడ్డివారిని
పోలియున్నారు!

వారు కలవరపడియున్నారు, వారు నిద్రించుచున్నారు; ఎందుకంటే, ఉదాహరణకు ఒక మనిషి ఇప్పటికీ తాను చూడగలిగేది మాత్రమే ఉనికిలో ఉన్నదని, ఎక్కడైతే అతడు తన కళ్లతో దేనినీ చూడలేడో అక్కడ జీవము లేదని ఎలా అనుకుంటాడు? కేవలం అతడు తన అంధత్వంలో తన కంటిద్వారా దానికి వ్యతిరేకమైన దాని గురించి ఇంతవరకు తనను ఒప్పించుకొనలేనందున, శరీరము మరణించడంతో తాను కూడా అంతమౌతానని ఎలా అనుకుంటాడు? కంటి యొక్క సామర్థ్యత ఎంత పరిమితమైయున్నదో పలు విషయాలనుండి అతడు ఇప్పటికీ తెలుసుకోలేదా? ఆ విషయం స్థలము మరియు కాలములకు నిబద్ధమైయున్న తన మెదడు యొక్క సామర్థ్యతపై ఆధారపడియున్నదని, ఈ కారణంగా అతడు స్థల-కాలములకు అతీతమైన సమస్తమును తన కంటితో గుర్తించ జాలడని, అతనికి ఇంకా తెలియదా? ఈ పరిహాసకులలో ఎవనికి కూడా తార్కికంగా అటువంటి నిగమనం చేయుట అర్థం కాలేదా? అయినా, ఆత్మీయ జీవితం, దానిని మనం ఆవలిలోకం అనికూడా అనవచ్చు, భూలోక స్థలము మరియు కాలముల విభజనకు పూర్తిగా అతీతమైనది కదా, అందువల్ల అది గుర్తించబడుటకు అదే రకమైన ప్రక్రియను అపేక్షిస్తుంది.

ఇంతకు మన కన్ను కనీసం స్థలము మరియు కాలములలో విభజించుటకు సాధ్యమైన వాటిని కూడా చూడలేదు. ఒక నీటి చుక్కను మనం తీసుకుందాం, దాని సంపూర్ణ స్వచ్ఛతను ప్రతి కన్ను ధృవీకరిస్తుంది, దానినే సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినట్లైతే, కనికరం లేకుండా పోరాడుతూ తమను పరస్పరం ధ్వంసం చేసుకొనే మిలియన్ల కొలది జీవులను అది కలిగియుంటుంది. కంటితో గుర్తించుటకు వీలుకాని, మానవ శరీరాలను నశింపజేయుటకు శక్తిగల సూక్ష్మక్రిములు కొన్నిసార్లు నీటిలోను, గాలిలోను ఉండవా? శక్తివంతమైన సాధనాల ద్వారానైతే అవి కనబడతాయి.

ఆ సాధనాలను శక్తివంతం చేసిన వెంటనే, ఇప్పటివరకు మీకు తెలియనివి, క్రొత్తవి అగుపడవని అయినప్పటికీ వాదించుటకు ఇంకా ఎవరైనా ధైర్యం చేయగలరా? వాటిని వెయ్యొంతులు, మిలియన్ వంతులు శక్తివంతం చేయండి, చూచుటకు అంతే ఉండదు కాని మీరింతవరకు చూడలేని, గ్రహించలేని క్రొత్త లోకాలు మీ ఎదుట ప్రత్యక్షమౌతాయి. మీరు వాటిని ఇంతవరకు చూడకపోయినా, గ్రహించకపోయినా అవి అక్కడ ఉండినవి.

తార్కిక ఆలోచన కూడా అన్ని విషయాలలో శాస్త్రాలు ఇంతవరకు సేకరించగల్గిన నిర్ధారణలకే వస్తుంది. ఎడతెగని అభ్యున్నతికి అవకాశం ఉన్నది, కాని అంతమునకు ఎప్పటికీ కాదు.

ఆవలిలోకం అంటే అసలు ఏమిటి? చాలామందిని ఆ పదం తికమకపెడుతుంది. ఆవలిలోకం అంటే భౌతిక సహాయసాధనాలతో గుర్తింపశక్యం కాని సమస్తము. భౌతిక సహాయసాధనాలంటే కళ్లు, మెదడు మరియు శరీరానికి సంబంధించిన అన్ని ఇతర భాగాలు, అదే విధంగా ఆ భాగాలకు అవిచేసే పనిని మరింత నిశితంగా, ఖచ్చితంగా చేయుటకు, దానిని మరింత విస్తరింపచేయుటకు సహాయపడే సాధనాలు.

అందువల్ల మనం అనవచ్చు: ఆవలిలోకం అంటే మన భౌతిక కళ్ల యొక్క గుర్తించే సామర్థ్యానికి ఆవల ఉన్నవి అని. కాని భూలోకానికి ఆవలిలోకనికి మధ్య విభజన లేదు! అగాధం కూడా లేదు! సమస్త సృష్టివలే అంతయు ఏకమైయున్నది. ఒకే శక్తి భూలోకం ద్వారానూ, ఆవలిలోకం ద్వారానూ ప్రవహిస్తుంది, సమస్తమూ ఈ ఒక్క జీవనధార ద్వారా జీవిస్తుంది మరియు పనిచేస్తుంది, తద్వారా అసలు విభజన చేయరాని విధంగా అనుసంధించబడి ఉన్నది. దాని ద్వారా ఈ క్రింది విషయం అర్థమౌతుంది.

ఒకవేళ దానిలో ఒక భాగం రోగగ్రస్తమైతే, దాని ప్రభావం శరీరంలోవలే, ఇతర భాగంలో కూడా తప్పక తెలియవలసియుంటుంది. సజాతి ఆకర్షణ ద్వారా ఈ ఇతర భాగంలోని అస్వస్థ పదార్థాలు రోగగ్రస్థ భాగానికి ప్రవహిస్తాయి, తద్వారా ఆ రోగాన్ని మరింత బలపరుస్తాయి. ఒకవేళ అటువంటి రోగం నయం కాని దానిగా వృద్ధిచెందినట్లైతే, దాని కారణంగా సమస్తము నిరంతరం బాధపడకుండా ఉండవలెనంటే, ఆ రోగగ్రస్థమైన భాగాన్ని త్యజించుట అనివార్యమౌతుంది.

ఈ కారణంగా మీ వైఖరిని మార్చుకోండి. ఈవలి- మరియు ఆవలిలోకములు ఉండవు కాని కేవలం ఒకే ఒక్క ఎకీకృత మనుగడ! తాను అన్నింటినీ చూడలేనందువల్ల మరియు తనకు గోచరమైన వాటన్నింటికీ తానే కేంద్రబిందువు మరియు ప్రధానబిందువు అనుకొని, మానవుడే విభజన అనే భావనను కనిపెట్టాడు. కాని అతని కర్తవ్యమండలము మరింత పెద్దదైయున్నది. విభజన అనే భ్రమ ద్వారా అతడు బలవంతంగా తనకు తానే హద్దులు ఏర్పరచుకుంటాడు, తన వికాసాన్ని ఆటంకపరుస్తాడు మరియు వికారమైన చిత్రములు ఉద్భవింపజేసే, హద్దులులేని ఊహకల్పనకు తావిస్తాడు.

దానికి పరిణామంగా, చాలామంది కేవలం నమ్మకంలేని
చిరునవ్వును కలిగియుండుట, మరికొందరు బానిసత్వంగా వృద్ధిచెందే లేక మూర్ఖాభిమానంగా అపభ్రంశం చెందే అనారోగ్యకరమైన ఆరాధనను కలిగియుండుట, ఆశ్చర్యకరమా? కొందరిలో బెదురుతోకూడిన భయం, భీతి మరియు ప్రాణభీతి అభివృద్ధిచెందినట్లైతే, ఎంకా ఎవరు ఆశ్చర్యపోతారు?

దీనినంతటిని వదిలిపెట్టండి. ఎందుకీ యాతన? మానవుల తప్పిదము నిర్మించుటకు ప్రయత్నించిన, నిజానికి ఏనాడూ ఉనికిలోలేని, ఆ అడ్డుగోడను కూల్చివేయండి! ఇదివరకటి తప్పుడు వైఖరి మీకు తప్పుడు పునాదిని కూడా ఇస్తుంది, దానిపై మీరు నిజమైన విశ్వాసమును, అనగా అంతరంగిక నిర్ధారణను, ఎడతెగకుండా నిర్మించుటకు వృధాప్రయాస చేస్తున్నారు. ఆ ప్రక్రియలో మీరు ప్రశ్నలను, అభ్యంతరాలను ఎదుర్కొంటారు, అవి మిమ్ములను తప్పక సంకోచించునట్లు, సంశయించునట్లు చేయవలసియుంటుంది లేక ఆ కట్టడమంతటినీ కూల్చుటకు నిర్బంధం చేయవలసియుంటుంది, ఆ తరువాత బహుశా పూర్తి నిరాశతో లేక ఆగ్రహంతో అంతటిని వదిలివేయుటకు.

అప్పుడు నష్టము మీరొక్కరిదే, ఎందుకంటే అది మీకు వికాసం కాదు కాని స్తబ్ధత లేక తిరోగమనము. ఏ మార్గాన మీరు ఒకానొక దినాన పోవలసియుంటుందో అది తద్వారా మీకు పొడిగించబడుతుంది.

చివరకు ఎప్పుడైతే మీరు ఈ సృష్టిని ఒక మొత్తంగా, అది ఎట్లు ఉన్నదో అట్లు, పరిగణిస్తారో, ఎప్పుడు మీరు భూలోక- మరియు ఆవలిలోకాల మధ్య విభజన చేయరో, అప్పుడు మీరు సూటిగా పోయే మార్గాన్ని కలిగియుంటారు, అసలైన గమ్యం చేరువౌతుంది, మరియు ఆరోహణ మీకు సంతోషమును మరియు సంతృప్తిని కలుగజేస్తుంది. అప్పుడు మీరు పరస్పరచర్యలను చాలా మెరుగుగా అనుభవిస్తారు, అర్థం చేసుకొంటారు, అవి అంతటిలో, ఏకీకృతమైన దానిలో, జీవపు వెచ్చదనంతో ప్రకంపిస్తుంటాయి, ఎందుకంటే సమస్త ప్రక్రియ ఒకే శక్తితో నడపబడుతుంది మరియు నిలవరించబడుతుంది. దానితో సత్యము యొక్క వెలుగు మీపై ఉదయిస్తుంది!

చాలామంది విషయంలో సుఖప్రీతి మరియు సోమరితనం పరిహాసాలకు కారణమని త్వరలోనే మీరు గ్రహిస్తారు, ఎందుకంటే ఇప్పటివరకు అభ్యసించినదాన్ని మరియు ఆలోచించినదాన్ని కూల్చివేసి క్రొత్తదానిని కట్టడం ప్రయాసతోకూడినది కాబట్టి. ఇతరులకు అది తాము అలవాటుపడిన జీవితగమనంలో జోక్యం చేసుకొంటుంది, అందువల్ల అది వారికి ఇబ్బందికరం అవుతుంది.

అటువంటివారిని వదిలేయండి, వాదించకండి, కాని మీ విజ్ఞానాన్ని క్షణికమైన సుఖాలతో తృప్తిపడక, ఈ భౌతికమనుగడలో జంతువులవలే కేవలం పొట్ట నింపుకోవడమే కాకుండా మరి ఎక్కువ వెదుకుచున్న వారికి మాత్రం సహాయపూర్వకంగా అందించండి. మీకు కలిగే గుర్తింపును వారికివ్వండి, ఆ ప్రతిభను అప్పుడు పూడ్చిపెట్టవద్దు; కాగా ఇచ్చుట ద్వారా మీ జ్ఞానము పరస్పరచర్యానుసారంగా మరింత సంపన్నమౌతుంది, బలపరచబడుతుంది.

ఒక నిత్యమైన శాసనం ఈ విశ్వంలో పనిచేస్తుంది: స్థిరమైన విలువల విషయంలో, కేవలం ఇచ్చుట ద్వారా మాత్రమే పొందగల్గవచ్చు! అది దాని సృష్టికర్త యొక్క పవిత్రమైన సంక్రమణమువలే ఎంతో లోతుగా పనిచేస్తూ సృష్టియంతటిలో విస్తరించియున్నది. పొందుట అంటే నిస్వార్థంగా ఇచ్చుట, అవసరమున్నచోట సహాయం చేయుట, మరియు పొరుగువాని బాధను, అదే విధంగా వాని బలహీనతలను అర్థంచేసుకొనుట, ఎందుకంటే, అత్యున్నతకు అదే నిజమైన, సరళమైన మార్గము!

మరియు దీనిని మనస్ఫూర్తిగా కాంక్షించుట మీకు వెంటనే సహాయాన్ని, శక్తిని కలుగజేస్తుంది! మంచికొరకు నిజాయితీతో కూడిన, హృదయపూర్వకమైన, ఒకే ఒక్క కోరికతో, మీ ఆలోచనలు స్వయంగా అడ్డంకుగా కట్టిన గోడ, మీకు ఇంకా కనబడని అవతలి ప్రక్కనుంచి ఒక మండేఖడ్గంతో చేయబడినట్లు ఖండించబడుతుంది; కాగా మీరు దేనిని గురించి భయపడుతున్నారో, ఏది లేదు అనుకొంటున్నారో లేక దేనిని మీరు ఆకాంక్షిస్తున్నారో ఆ ఆవలిలోకంతో మీరు ఒకటైయున్నారు, దగ్గరగా, విడదీయరాని విధంగా దానితో అనుసంధించబడియున్నారు.

దానిని ప్రయత్నించుడి; కాగా మీ ఆలోచనలు మీరు బయటకు పంపే రాయబారులు, అవి మీ ద్వారా ఆలోచించబడినదానితో బరువుగా మోపబడినవై తిరిగివస్తాయి, అది మంచైనా లేక చెడైనా. అది జరుగుతుంది! గుర్తుంచుకోండి, మీ ఆలోచనలు వాస్తవమైనవి, అవి తమను తాము ఆత్మీయంగా రూపొందించుకొంటాయి, తరచుగా మీ శరీరం యొక్క భూలోక జీవితకాలం కంటే ఎక్కువ కాలం మనుగడలో ఉండే ఆకృతులౌతాయి, అప్పుడు మీకు చాలా అర్థమౌతుంది.

అందువల్లనే చాలా యుక్తంగా: “కాగా వారి పనులు వారిని వెంబడించును!” అని చెప్పబడింది. ఆలోచనల-ఉత్పాదనలు ఒకనాడు మీకొరకై వేచియుండే
కార్యాలు! అవి మీ చుట్టూ ప్రకాశవంతమైన లేక మబ్బైన వలయాలను నిర్మిస్తాయి, ఆత్మీయ లోకంలోనికి చొచ్చుకొనిపోవుటకు మీరు వాటిగుండా సంచరించవలసియుంటుంది. ఎటువంటి రక్షణ, ఎటువంటి జోక్యము ఆ విషయంలో సహాయపడవు, ఎందుకంటే నిర్ణయము మీ స్వంతమైనది. అందువల్ల అన్నింటిలో మొదటి అడుగును తప్పక మీరే వేయాలి. అది కష్టమైనది కాదు, అది కేవలం ఆలోచనల ద్వారా అభివ్యక్తమయ్యే సంకల్పంలో ఉన్నది. అందువల్ల, స్వర్గాన్ని అదే విధంగా నరకాన్ని మీరు మీలోనే కలిగియున్నారు.

నిర్ణయాన్ని మీరు తీసుకోగలరు, కాని మీ ఆలోచనల, సంకల్పముల యొక్క ఫలితాలకు మీరు బేషరతుగా కట్టుబడి ఉంటారు! ఈ ఫలితాలను మీకై మీరే ఉత్పాదిస్తారు కాబట్టి నేను మీకు ఉద్భోధిస్తున్నాను:

“మీ ఆలోచనల అంతికను స్వచ్చంగా ఉంచుకోండి, తద్వారా మీరు శాంతిని కలుగజేస్తారు మరియు సంతొషిస్తారు!”

మరచిపోకండి, మీరు సృష్టించి బయటకు పంపే ఆలోచనలలో ప్రతీదీ, దాని మార్గంలో సజాతీయమైన వాటినన్నింటిని ఆకర్షిస్తుంది లేక వాటికి తాను చేరుతుంది, తద్వారా అంతకంతకు బలపడుతుంది మరియు చివరకు ఒక గమ్యాన్ని, ఒక మెదడును, ఏదైతే బహుశా కేవలం కొద్ది క్షణాలపాటు తన్నుతాను మరచి అటువంటి తేలుతున్న ఆలోచనరూపాలు ప్రవేశించుటకు మరియు క్రియాత్మకమగుటకు తావిస్తుందో, దానిని చేరుతుంది.

కేవలం దాని గురించి ఆలోచించండి, ఒకవేళ ఆ ఆలోచన ఎప్పుడో ఒకసారి, ఎవరిపై అది పనిచేయగల్గిందో వాని ద్వారా క్రియగా మారినట్లైతే, అప్పుడు మీపై ఎంత బాధ్యత పడుతుందో! ప్రతి ఆలోచన, తెంపనశక్యమైన పోగుతో ఉన్నట్లు, ఎల్లప్పుడూ మీతో సంబంధాన్ని కొనసాగించుట ద్వారానే ఆ బాధ్యత కార్యరూపమౌతుంది; తద్వారా మార్గంలో పొందిన బలంతో సహా తిరిగివచ్చుటకు, మీరు సృష్టించిన రకానికి అనుగుణంగా మీపై తిరిగి భారంవేయుటకు లేక మిమ్ములను సంతోషపరచుటకు.

ఈ విధంగా మీరు ఆలోచనల లోకంలో నిలిచియున్నారు మరియు మీ ఆలోచనాసరళి యొక్క రకం ద్వారా అదే రకమైన ఆలోచనారూపాలకు తావు కూడా ఇస్తారు. అందువల్ల ఆలోచన యొక్క శక్తిని వృధాచేయకండి, కాని దానిని రక్షణకొరకు మరియు ఈటెలవలే బయటకుపోయి అన్నింటిపై పనిచేసే నిశితమైన ఆలోచనప్రక్రియ కొరకు సమకూర్చండి. ఆ విధంగా, మీ ఆలోచనలలోనుండి మంచికొరకు పోరాడే, గాయాలనుమానిపె మరియు సమస్త సృష్టికి ప్రోద్బలాన్నిచ్చే పవిత్రమైన ఈటెను సృష్టించండి!

అందువల్ల, ఆలోచనాసరళిని కార్యాచరణకు మరియు పురోగతికి అనుగుణంగా సవరించండి! దానిని చేయుటకు మీరు సాంప్రదాయ అభిప్రాయాలను మోసే చాలా స్థంభాలను తప్పక కుదుపవలసియుంటుంది. తరచుగా అది ఒక భావనయైయుంటుంది, దానిని తప్పుగా అర్థంచేసుకోవడంవల్ల అది నిజమైన మార్గాన్ని కనుగొననివ్వదు. అతడు ఎక్కడ మొదలుపెట్టాడో ఆ స్థానానికి అతడు తప్పక తిరిగిపోవలసి ఉంటుంది. ఒక్క వెలుగు కిరణం అతడు దశాబ్దాలుగా ప్రయాసపడి కట్టిన కట్టడం మొత్తాన్ని కూల్చివేస్తుంది. అప్పుడు అతడు స్వల్ప లేక దీర్ఘకాలంపాటు దిమ్మెరపోయిన తరువాత తిరిగి క్రొత్తగా పనిని మొదలుపెడతాడు. అతడు తప్పక అట్లు చేయవలెను, ఎందుకంటే విశ్వంలో స్తబ్ధత ఉండదు. కాలం యొక్క భావాన్ని మనం ఉదాహరణగా తీసుకొందాం:

కాలం గడుస్తుంది! కాలాలు మారుతాయి! మనుష్యులు అంతటా అలా అనడం మనం వింటుంటాం, తద్వారా అసంకల్పితంగా ఆత్మయందు ఒక చిత్రం ఉద్భవిస్తుంది: కాలాలు మారుతూ మనల్ని దాటిపోవడాన్ని మనం చూస్తాం!

ఈ చిత్రం అలవాటుగా మారుతుంది మరియు చాలామందిలో ఆ విధంగా ఒక బలమైన పునాదిని కూడా వేస్తుంది, వారు దానిపై నిర్మాణాన్ని కొనసాగిస్తారు, వారి సమస్త పరిశోధనను, దీర్ఘాలోచనను దానికి అనుగుణంగా మలచుకొంటారు. కాని, తమను పరస్పరం విభేదించుకొనే అడ్డంకులను వారు ఎదుర్కొనుటకు ఎంతోకాలం పట్టదు. అత్యాసక్తితో ప్రయత్నించినా కూడా ఇకపై అంతయూ పూర్తిగా ఇముడదు. వారు తప్పిపోతారు మరియు సమస్తమైన యోచన ద్వారా కూడా ఇకపై పూరించలేని కంతలను వదులుతారు.

చాలామంది అప్పుడు అనుకొంటారు, తార్కిక ఆలోచన ఎటువంటి పరిష్కారం అందించనిచో, అటువంటి చోట్లలో దానికి ప్రత్యమ్నాయంగా విశ్వాసం తప్పక తీసుకోబడాలని. కాని అది తప్పు! మనిషి తాను గ్రహించలేని విషయాలను నమ్మరాదు! వాటిని అర్థంచేసుకొనుటకు అతడు తప్పక ప్రయత్నించాలి; కాగా అట్లు చేయని పక్షంలో అతడు తప్పిదాలకు తలుపులను బార్లగా తెరుస్తాడు; తప్పిదాల ద్వారా సత్యం ఎల్లప్పుడు అవమూల్యపరచబడుతుంది.

గ్రహించకుండా నమ్ముట కేవలం
సోమరితనము, ఆలోచించుటకు బద్దకమైయున్నది! అది ఆత్మను ఊర్ధ్వదిశగా నడిపించదు కాని దానిని క్రిందకు అణగద్రొక్కుతుంది. అందువల్ల దృష్టిని ఊర్ధ్వానికి సారించండి. మనం పరీక్షించవలసియున్నది, పరిశోధించవలసియున్నది. దానికొరకుగల ప్రేరణ కారణం లేకుండానే మనలో లేదు.

కాలం! అది నిజంగా గడుస్తుందా? మనిషి ఆ సిద్ధాంతం గురించి మరింత లోతుగా ఆలోచించాలనుకున్నప్పుడు ఎందుకు అడ్డంకులను ఎదుర్కొంటాడు? అది చాలా సులభం, ఎందుకంటే ఆ మౌళిక ఆలోచన తప్పు కాబట్టి; కాగా కాలం కదలకుండా నిలిచియుంటుంది. మనం మాత్రం దానిని ఎదుర్కొనుటకు త్వరపడతాం! మనం శాశ్వతమైన కాలంలోకి దూసుకొని వెళ్తాం, మరియు దానిలో సత్యము కొరకు అన్వేషిస్తాం.

కాలం నిస్తబ్ధంగా ఉంటుంది. అది నేడు, నిన్న మరియు వేయి సంవత్సరాలలో కూడా అదే విధంగా ఉంటుంది! కేవలం రూపాలే మారుతాయి. కాలం ఒడిలోని నిక్షేపాలలోనుండి తోడుటకు, తద్వారా కాలం యొక్క సేకరణలలోనుండి మన విజ్ఞానాన్ని వృద్ధిచేయుటకు, మనమే కాలంలో మునుగుతాం! కాగా అది దేనినీ కోల్పోలేదు, అన్నింటినీ భద్రపరచింది. అది నిత్యమైనది కాబట్టి, అది మారలేదు.

నీవు కూడా, ఓ మనుష్యుడా, ఎప్పటికీ నీవై మాత్రమే ఉంటావు, నీవు యవ్వనంగా కనిపించినా లేక ముసలిగా కనిపించినా! నీవు నీవుగానే ఉంటావు! దానిని నీవు ఇంకా గ్రహించలేదా? రూపానికి మరియు నీ యొక్క “అహానికి” మధ్యవున్న తేడాను నీవు స్పష్టంగా గమనించడం లేదా? మార్పులకు లోనైయున్న శరీరానికి మరియు నీకు, అనగా నిత్యమైన ఆత్మకు మధ్య తేడాను?

మీరు సత్యమును అన్వేషిస్తున్నారు! సత్యము అంటే ఏమిటి? మీరు నేడు కూడా సత్యమైనవిగా అనుభవించిన వాటిని రేపే తప్పైనవిగా గుర్తిస్తారు, ఆ తప్పుల్లో ఆ తరువాత మరల సత్యపు రేణువులను కనిపెట్టుటకు! కాగా సాక్షాత్కారములు కూడా తమ రూపాలను మారుస్తుంటాయి. ఎడతెగని మీ అన్వేషణ ఆ విధంగా సాగుతుంది, కాని ఈ మార్పుప్రక్రియలలో మీరు పరిపక్వం చేయబడతారు!

అయితే సత్యం ఎల్లప్పుడు ఒకే విధంగా ఉంటుంది, అది మార్పుచెందదు; కాగా అది నిత్యమైనది! అది నిత్యమైనది అయినందువల్ల, రూపపరివర్తనలను మాత్రమే ఎరిగిన ఐహిక ఇంద్రియాలతో దానిని స్వచ్చంగా మరియు నిజంగా అవగాహన చేసుకొనుట ఎప్పటికీ అసాధ్యమైయుంటుంది!

అందువల్ల ఆత్మీయులు అవ్వండి! సమస్త ఐహిక ఆలోచనలనుండి స్వతంత్రించుకోండి, అప్పుడు మీరు సత్యమును కలిగియుంటారు, సత్యములో ఉంటారు, మీ చుట్టూ దాని యొక్క స్వచ్ఛమైన వెలుగు ద్వారా ఎడతెగక కమ్మబడి, దానిలో మునిగియుంటారు; కాగా అది మిమ్ములను పూర్తిగా కమ్మివేస్తుంది. మీరు ఆత్మీయులైన వెంటనే దానిలో ఈదుతారు.

అప్పుడు మీకు ప్రయాసపడి శాస్త్రాలను ఆపై అభ్యసించవలసిన అవసరం ఉండదు, ఎటువంటి తప్పులకు కూడా భయపడవలసిన అవసరం ఉండదు కాని అప్పటికే మీరు ప్రతి ప్రశ్నకు సాక్షాత్తు సత్యంలోనే సమాధానాన్ని కలిగియుంటారు, అంతేగాక, మీకు ఎటువంటి ప్రశ్నలు కూడా ఉండవు, మీరు ఆలోచించకుండానే అన్నింటినీ ఎరిగియుంటారు, అంతయూ గ్రహించియుంటారు, ఎందుకంటే మీ ఆత్మ స్వచ్ఛమైన వెలుగులో, సత్యములో జీవిస్తుంది కాబట్టి!

కనుక ఆత్మీయంగా స్వతంత్రులు కండి! మిమ్ములను అణచియుంచిన బంధకాలను తెంచివేయండి! అట్లు చేయునప్పుడు మీకు అడ్డంకులు కలిగినచో వాటిని సంతోషంగా ఎదుర్కొనండి. కాగా అవి మీకు స్వేచ్ఛను మరియు శక్తికి మార్గాన్ని సూచిస్తాయి! మీకు లబ్దిని చేకూర్చే వరాలుగా వాటిని పరిగణించండి అప్పుడు మీరు వాటిని సునాయాసంగా అధిగమిస్తారు.

వాటి ద్వారా మీరు నేర్చుకొనుటకుగాను మరియు మీ అభ్యున్నతికొరకు, అవి మీ మార్గంలో ఉంచబడతాయి, తద్వారా మీరు మీ ఆరోహణ-సాధనాలను పెంపొందించుకొనుటకు, లేనిచో అవి మీ రుణ భారానికి కలిగే ప్రతిఫలాలైయుంటాయి, తద్వారా మీరు వాటినుండి విముక్తిపొందుటకు మరియు మిమ్ములను స్వతంత్రించుకొనుటకు. రెండు సందర్భాలలోనూ అవి మిమ్ములను ముందుకు నడిపిస్తాయి. అందువల్ల ధైర్యంగా వాటిగుండా ముందుకు సాగండి, అది మీ మేలుకొరకే!

గ్రహచారాల గురించి లేక పరీక్షల గురించి మాట్లాడుట అవివేకం. ప్రతి పోరాటము మరియు ప్రతి దుఃఖము అభ్యున్నతే. మనుష్యులకు తద్వారా మునుపటి అకృత్యముల యొక్క మరకలను తుడిచివేయుటకు అవకాశం ఇవ్వబడుతుంది; కాగా ఏ వ్యక్తికి కూడా దానిలోనుండి ఒక దమ్మిడీ అంత కూడా క్షమించబడజాలదు, ఎందుకంటే నిత్యమైన శాసనాల గతిచక్రం ఈ విషయంలో కూడా విశ్వంలో సుస్థిరమైనది; వాటియందు సృజనాత్మకమైన
తండ్రిచిత్తము వ్యక్తమౌతుంది, దానితో అది మనలను క్షమిస్తుంది మరియు సమస్త చీకటిని తొలగిస్తుంది.

సమస్తమూ ఎంత తేటగా మరియు విజ్ఞతతో వ్యవస్థీకరించబడిందంటే, దానిలో అతి చిన్న సూత్రభంగము కూడా ప్రపంచాన్ని శిథిలం చేయవలసియుంటుంది.

ఎవనికి గతించిన కాలంలోనుండి విమోచన చేయవలసినది చాలా ఉన్నదో, ఆ మనిషి మరి నిరాశపడవద్దా, తన పాపాలకు ప్రాయశ్చిత్తం చెల్లించుటకు అతనికి వణుకు పుట్టదా?

నిజాయితీగా అభీష్టించిన తక్షణమే అతడు దానిని నమ్మకంతో మరియు ఆనందంతో మొదలుపెట్టవచ్చు, ఏ విచారమూ లేకుండా ఉండవచ్చు. కాగా మంచిదైన సంకల్పశక్తి యొక్క ఎదురు-ప్రవాహం ద్వారా సంతులనను కలుగజేయవచ్చు; ఆ శక్తి ఆత్మికతలో ఇతర ఆలోచనరూపాలవలే సజీవమౌతుంది మరియు ప్రతి చీకటిభారాన్ని, ప్రతి బరువును తొలగించుటకు మరియు “అహాన్ని” వెలుగుదిశగా నడిపించుటకు సామర్థ్యంగల బలమైన ఆయుధం అవుతుంది.

సంకల్పం యొక్క శక్తి! ఎంతోమంది ద్వారా పసికట్టబడని శక్తి; అది ఎప్పుడూ విఫలంకాని అయస్కాంతంవలే సారూప్యమైన శక్తులను ఆకర్షిస్తుంది, తద్వారా హిమపాతంవలే వృద్ధిచెందుటకు; మరియు అది తనకు ఆత్మీయంగా సారూప్యమైన శక్తులతో ఏకమై తిరోగమిస్తుంది, ప్రారంభమైన చోటికి తిరిగిచేరుతుంది, అనగా తన మూలాన్ని, సరిగా చెప్పాలంటే, ఉత్పాదకున్ని చేరుతుంది. మరియు అది, ఉత్పాదకుడు ప్రారంభంలో సంకల్పించిన దాని రకానికి అనుగుణంగా, అతన్ని పైకి, వెలుగునకు ఎత్తుతుంది లేక లోతునకు, బురదలోనికి మరియు మురికిలోనికి అణిచివేస్తుంది!

ఎవడైతే సమస్త సృష్టిలో ఇమిడియున్న, స్థిమితమైన, అనివార్యంగా నెరవేరే, అచంచలమైన నిశ్చయతతో సాక్షాత్కరించే మరియు వికసించే ఈ పరస్పరచర్యను ఎరిగియుంటాడో వానికి దానిని ఉపయోగించుట తెలిసియుంటుంది. వాడు దానిని తప్పక ప్రేమిస్తాడు, దానికి తప్పక భయపడతాడు! వానికి క్రమేణా వానిచుట్టూవున్న అదృశ్యలోకం సజీవమౌతుంది; కాగా వాడు దాని చర్యలను ప్రతి అనుమానమును తుడిచివేయునంత స్పష్టంగా అనుభవిస్తాడు.

అతడు కొద్దిగా ధ్యానం ఉంచిన వెంటనే, గొప్ప విశ్వంలోనుండి అతనిపై ప్రభావం చూపే విరామంలేని కలాపం యొక్క బలమైన అలలను అంతఃకరణానుభూతి ద్వారా తప్పక తెలుసుకోవలసియుంటుంది. ఏ విధంగా కుంభాకార కటకం సూర్యకిరణాలను గ్రహించి ఒక బిందువుపై కేంద్రీకరించి అక్కడ శక్తిని ఉత్పాదిస్తుందో అదే విధంగా బలమైన ప్రవాహలకు తానే కేంద్రబిందువును నిర్ణయిస్తాడని అతడు చివరకు తెలుసుకొంటాడు. ఆ శక్తి రగిలించగలదు, కాల్చివేస్తూ నాశనం చేయగలదు, అదే విధంగా అది స్వస్థపరుస్తూ మరియు ఉత్తేజపరుస్తూ, ఆశీర్వాదాన్ని కలుగజేస్తూ ప్రవహించగలదు. అది ప్రజ్వరిల్లే మంటను కూడా రేపగలదు!

మీరు కూడా అటువంటి కటకములే, మీ సంకల్పం ద్వారా మిమ్ములను చేరే అగోచరమైన ఈ శక్తిప్రవాహాలను ఒక శక్తిగా సమకూర్చి మంచి లేక చెడు ధ్యేయాల నిమిత్తం బయటకు పంపుటకు, తద్వారా మానవాళికి దీవెనను లేక వినాశాన్ని కలుగజేయుటకు సమర్థులు. తద్వారా మీరు ఆత్మలలో ప్రజ్వరిల్లే మంటను, మంచితనము, ఉదాత్తత మరియు సంపూర్ణతల కొరకైన ఉత్సాహపు మంటను రేపగలరు మరియు రేపవలెను!

దానికి కేవలం సంకల్పశక్తి మాత్రమే అవసరం; అది మనిషిని ఒక నిర్దిష్టమైన భావనలో సృష్టికి అధిపతిని చేస్తుంది, అతడు తన ప్రారబ్ధాన్ని స్వయంగా నిర్ణయించుటకు. అతని సంకల్పము అతనికి వినాశమును లేక విమోచనను కలుగజేస్తుంది! అతనికి స్వయంగా బహుమానమును లేక శిక్షలను నిర్దయాత్మకమైన నిశ్చితముతో తెస్తుంది.

ఈ జ్ఞానము మిమ్ములను సృష్టికర్తనుండి వేరుచేయుననియూ, ఇంతవరకు మీరు కలిగియున్న విశ్వాసమును బలహీనపరచుననియూ భయపడకండి. దానికి విరుద్ధంగా, మీరు ఉపయోగించగలిగే ఈ నిత్యమైన-శాసనాల-పరిజ్ఞానం సమస్త సృష్టిని మీకు మరింత ఘనంగా కనబడునట్లు చేస్తుంది. అది తన ఘనత ద్వారా, లోతుగా పరిశోధించే వానిని, ఆరాధనలో మోకరిల్లజేస్తుంది!

అప్పుడు మనిషి చెడును ఎప్పటికీ సంకల్పించడు. సంతోషభరితుడై అతడు తనకున్న అతి శ్రేష్టమైన ఆధారాన్ని పట్టుకొంటాడు: ప్రేమను! అధ్భుతమైన యావత్ సృష్టిపై ప్రేమను, తన పొరుగువానిపై ప్రేమను, తద్వారా వానిని కూడా ఈ సుఖానుభూతి యొక్క మహాత్యానికి, ఈ శక్తి యొక్క స్పృహలోనికి నడిపించుటకు.