నైతికత

క నల్లటి మేఘం మానవాళిపై క్రమ్ముకొనియున్నట్లు ఉన్నది.వాతావరణం ఉబ్బరిస్తున్నది.మాంద్యంతో,భారీ వత్తిడిక్రింద మనుష్యుల వ్యక్తిగత అంతఃకరణగ్రహణశీలత పనిచేయుచున్నది.తప్పుడు పెంపుదల యొక్క దోషము ద్వారా,తప్పుడు దృక్పథం ద్వారా మరియు స్వంత-భ్రమల ద్వారా కృత్రిమంగా ప్రేరేపించబడి శరీరం యొక్క భావోద్వేగాలపై మరియు ఉపజ్ఞలపై పనిచేసే నరాలు మాత్రమే అతిబలంగా బిగుసుకొని ఉన్నాయి.

ఈ విషయంలో నేటిమనిషి సాధారణ స్థితిలో లేడు, కాని అతడు రోగగ్రస్తమైన, పదింతలవరకు హెచ్చించబడిన కామాన్ని తనలో కలిగియున్నాడు. దానికి అతడు వందరకాల ఆకారాలతో మరియు రకములతో ఒక ఉపాసనాన్ని నిర్మించుటకు ప్రయత్నిస్తున్నాడు. అది తప్పక సంపూర్ణ మానవాళి యొక్క నాశనకారి అవుతుంది.

అంటువ్యాధి మరియు సంక్రమణ వ్యాది అయిన ప్లేగువలే ఇది అంతయూ కాలక్రమంలో, ఎవరైతే ఇంకా తమ ఉపచేతనం చాటున తేలుతూ ఉన్నటువంటి ఒక ఆదర్శానికి తెగింపుతో వ్రేలాడుటకు ప్రయత్నిస్తారో, వారిపై కూడా పనిచేస్తుంది. ఆశతో వారు తమ చేతులను దానికొరకు చాస్తున్నారు, కాని వారు తమ దృష్టిని తమ పరిసరాలపై సారించినప్పుడు నిరాశ, నిస్పృహలతో వాటిని పదే పదే దింపివేస్తున్నారు.

నిస్తేజమైన నిస్సహాయతలో భీతితో వారు చూస్తున్నారు, నీతి మరియు అవినీతుల విచక్షణకొరకు గల తేటదృష్టి ఎటువంటి శరవేగంతో మందగిస్తున్నదో, నిర్ధారణ చేయగలిగే సామర్థ్యత నశిస్తున్నదో మరియు గ్రహణశక్తి ఏ విధంగా మార్పుచెందుతున్నదో. ఆ మార్పు ఏ విధంగా జరుగుతుందంటే, చాలా విషయాలు ఏవైతే అనతికాలం మునుపే ఏవగింపును మరియు ఈసడింపును కలిగించగలిగేవో అవి, కనీసం ఆశ్చర్యాన్ని కూడా కలిగించకుండా, అతిత్వరగా పూర్తిగా సాధారణమైనవిగా అంగీకరించబడతాయి.

కాని త్వరలోనే ఆ గిన్నె అంచులవరకు నింపబడుతుంది. భయానకమైన మేల్కొలుపు తప్పక రావలసియుంటుంది!

విభ్రమలోలత్వానికి లోనైయున్న ఈ జనసందోహాలు ఇప్పటికే అప్పుడప్పుడు పూర్తి యాంత్రికంగా, అపస్మారకంగా బెదురుతో అకస్మాత్తుగా జంకుతుంటారు. అనిశ్చితి క్షణకాలంపాటు చాలా హృదయాలను పట్టివేస్తుంది; కాని అది మేల్కొలుపును కాని, తమ అనుచితమైన నడవడికపై తేటయైన అంతఃకరణానుభూతిని కాని కలిగించదు. అప్పుడు, అటువంటి “బలహీనతను” లేక పురాతన భావాల “చివరి అవశేషములను” వదిలించుకొనుటకు లేక పూర్తిగా అణగద్రొక్కుటకు రెండింతల పట్టుదల మొదలౌతుంది.

ఏ ధరకైనా పురోగమనం ఉండాలి. అయితే పురోగమనం రెండువైపులలో జరుగవచ్చు. ఎగువకు లేక దిగువకు. మనిషి ఎంచుకొన్న దాని ప్రకారం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అది భితిగొల్పే వేగంతో దిగువకు పోతున్నది. సమయం ఆసన్నమైనప్పుడు ఆ విధంగా దిగువకు దూసుకొనిపోయేవారు ఒక బలమైన అవరోధానికి తగులుతారు కాబట్టి, ఆ తాకుడు వారిని తునాతునకలు చేయవలసియుంటుంది.

ఈ ఉబ్బరించే వాతావరణంలో తుఫాను-మేఘము ఇంకా దట్టంగా, మరింత అనర్థదాయకంగా మారుతుంది. ఇప్పుడు ఏ క్షణంలోనైనా అంధకారాన్ని ఛేదించి కాంతిని కలుగజేసే మొదటి పిడుగు పుంజం రాబోతుంది. అది మండుతూ అతిమూలన దాగియున్న దానిపై కూడా కఠినంగా మరియు తీక్షణంగా వెలుగును ప్రకాశింపజేస్తుంది. అది తనలో, వెలుగుకొరకు మరియు స్పష్టతకొరకు కృషిచేసే వారికి విడుదలను కలిగియుంటుంది, కాని వెలుగును కాంక్షించని వారికి నాశనాన్ని కలుగజేస్తుంది.

ఈ మేఘము తన నల్లదనమును మరియు బరువును దట్టముచేయుటకు ఎంత ఎక్కువ సమయాన్ని పొందుతుందో అంత జిగేలుమంటూ మరియు భీతిగొల్పే విధంగా అది పుట్టించే పిడుగు ఉంటుంది. మృదువైన, మాంద్యమును కలిగించే ఆ గాలి, ఏదైతే తన జాడ్యము వెనుక పొంచుకొనియున్న విభ్రమలోలత్వాన్ని కలిగియున్నదో, అది నశిస్తుంది; కాగా ఆ మొదటి పిడుగు వెంట సహజంగా క్రొత్త జీవమును తెచ్చే తరుణమైన ఈదురుగాలి వీస్తుంది. వెలుగు యొక్క తీవ్రమైన స్పష్టతలో ఆకస్మికంగా మబ్బైన భూతకల్పన యొక్క అన్ని ఉత్పన్నాలు వాటి కపటమైన అసత్యాలనుండి వేరుచేయబడి, దిగ్భ్రాంతి చెందిన మానవాళి ఎదుట నిలుస్తాయి.

ఆ మెలుకువ ఆత్మలలో ఒక గొప్ప ఉరుమువల్ల కలిగే బెదురువలే పనిచేస్తుంది, తద్వారా మసకబారని సత్యము యొక్క జీవపు ఊటనీరు పొంగుతూ తద్వారా గుల్లపారిన నేలపైకి పారగలుగుటకు. స్వాతంత్ర్యదినము ఉదయిస్తుంది. వేల సంవత్సరాలనుండి ఉనికిలోవున్న మరియు ఇప్పుడు తారాస్థాయికి ఎదుగుతున్న అనైతికత యొక్క వశీకరణనుండి విముక్తి కలుగుతుంది.

చుట్టూ చూడండి! మనుష్యులు చదివేవాటిని, వారి నృత్యాలను, వస్త్రధారణను గమనించండి! ప్రస్తుతకాలం మునుపెన్నడూ చేయనంత ఎక్కువగా కృషిచేస్తున్నది, రెండు లింగముల మధ్యగల అన్ని అవరోధాలను కూల్చివేయుట ద్వారా అంతఃకరణగ్రహణశీలత యొక్క స్వచ్ఛతను క్రమంగా మసకబారజేయుటకు, దానిని ఆ మసకలో వక్రీకరించుటకు మరియు దానికి మభ్యపెట్టే తొడుగులను వేయుటకు, దానిని, ఒకవేళ ఏ విధంగానైనా సాధ్యమైనచో, చివరకు ఊపిరి అందకుండాచేసి మట్టుబెట్టుటకు.

తలెత్తే అనుమానాలను మనుష్యులు గొప్ప ప్రసంగాలతో శాంతపరుస్తారు, కాని నిశితంగా పరీక్షించినట్లైతే అవి అంతరంగంలో ప్రకంపించే కామవాంఛనుండి ఉత్పన్నమౌతుంటాయి, తద్వారా లెక్కలేనన్ని రకాలలో నైపుణ్యంతో మరియు నైపుణ్యహీనంగా, చాటుగా లేక బహిరంగంగా తమకములకు ఎల్లప్పుడు క్రొత్త పోషణమును ఇచ్చుటకు.

వారు స్వేచ్ఛాయుతమైన, స్వతంత్రమైన మానవాళి యొక్క ఆవిర్భావం గురించి మాట్లాడతారు, అంతరంగంలో దృఢత్వం యొక్క అభివృద్ధిని గురించి, శారీరక సంస్కృతిని గురించి, నగ్నత యొక్క సౌందర్యతను గురించి, ఉదాత్తపరచబడిన క్రీడను గురించి, “శుద్ధునికి సమస్తము శుద్ధమే” అనే నానుడిని సజీవపరచుటకు అవసరమైన అభ్యాసమును గురించి, క్లుప్తంగా: సమస్త “బిడియమును” వదిలివేయుట ద్వారా మానవజాతి యొక్క అభ్యున్నతిని, తద్వారా ఉదాత్తుడైన, స్వేచ్ఛాయుతుడైన, భవిష్యత్తు యొక్క బాధ్యతను భరించే మనిషిని ఆవిర్భవింపజేయుటకు! దానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుటకు ధైర్యంచేసే వానికి శ్రమ! అటువంటి సాహసవంతునిపై తక్షణమే గొప్ప కేకలతో, కేవలం అశుద్ధమైన ఆలోచనలే అతన్ని “దానిలో ఏదో తప్పును కనుగొనుటకు” పురికొల్పగలవు అనే ఆరోపణలను పోలిన నిందలు మోపబడతాయి!

అది దుర్గంధమైన నీటి యొక్క ఒక గొప్ప సుడిగుండము. దానిలోనుండి దిమ్మ కలిగించే మరియు విషపూరితం చేసే వాతావరణం వ్యాపిస్తుంది. అది మోర్ఫిన్ కలిగించే మత్తువలే మతిభ్రమింపజేసే భ్రాంతులను పుట్టిస్తుంది. నిత్యము వేలకు వేలమంది దానిలోనికి తమను జారిపోనిస్తుంటారు, చివరకు బలహీనపడుతూ దానిలో మునిగిపోవునంతవరకు.

సహోదరుడు సహోదరికి బోధచేయుటకు ప్రయత్నిస్తాడు, పిల్లలు తల్లిదండ్రులకు. ఒక తుఫాను కెరటంవలే అది మనుష్యులందరిపైకి దూసుకొని వస్తుంది. ఎక్కడైతే కొంతమంది వివేకవంతులు ఈసడింపుతో, సముద్రంలో శిలలవలే ఒంటరిగా ఇంకా నిలిచియున్నారొ అక్కడ గొప్ప సముద్రపు కెరటాలు కనిపిస్తాయి. ఎవరి శక్తి ఆ తుఫానులో నశించిపోయే ప్రమాదం ఉందో అటువంటివారు చాలామంది, వీరికి అంటిపెట్టుకొని ఉంటారు. ఎడారిలో ఒయాసిస్సులవలే నిలిచియున్న ఈ చిన్న గుంపులను మనుష్యులు ఇష్టంగా చూస్తారు. ఈ గుంపులు ఒయాసిస్సులవలే ఉపశాంతిని కలుగజేస్తూ, నాశనకరమైన ఇసుక తుఫాను గుండా ప్రయాసతో పోరాడివచ్చిన ప్రయాణికున్ని సేదదీర్చుకొనుటకు, విశ్రాంతిని పొందుటకు మరియు బలపడుటకు ఆహ్వానిస్తుంటాయి.

ఏది ఈనాడు అందమైన పురోగమనం ముసుగులో బోధించబడుతుందో అది అత్యంత సిగ్గులేనితనాన్ని పరోక్షంగా ప్రోత్సాహించుట, మనిషిలోని ప్రతి ఉన్నతమైన అంతఃకరణానుభూతిని విషపూరితంచేయుట తప్ప మరేమీ కాదు. ఇది మానవాళికి సోకిన వాటన్నింటిలో అత్యంత పెద్ద తెగులు. మరియు అది ఎంత విచిత్రంగా ఉన్నదంటే: చాలామంది, తమను తాము దిగజార్చుకొనుటకుగాను ఒక విశ్వసనీయమైన సాకు తమకివ్వబడుతుందని ప్రత్యేకంగా వేచియున్నట్లున్నది. లెక్కలేనంతమంది మనుష్యులకు అది చాలా స్వాగతమైయున్నది!

కాని ఎవడు విశ్వంలో పనిచేస్తున్న ఆత్మీయ శాసనాలను ఎరిగియుంటాడో వాడు అసహ్యంతో ప్రస్తుత ప్రయత్నాలనుండి వెనుదిరుగుతాడు. “అత్యంత నిరపాయకరమైన” ఆహ్లాదములనుండి మనం కేవలం ఒకే ఒక్క దానిని మాత్రమే తీసుకొందాం: “స్త్రీపురుషులు కలిసి స్నానాలుచేసె కుటుంబ స్నానశాలలు”.

“శుద్ధునికి సమస్తము శుద్ధమే!” ఇది ఎంత ఇంపుగా వినబడుతుందంటే, దాని శ్రావ్యత వెనుక పలువిధమైనవి అనుమతించబడవచ్చు. కాని మనం ఒకసారి అటువంటి ఒక స్నానశాలలో చోటుచేసుకొనే అతి సాధారణమైన సూక్ష్మపదార్థ ప్రక్రియలను గమనిద్దాం. వివిధ లింగములనుండి ముప్పై మంది ఉన్నారని మరియు వారిలోనుండి ఇరవైతొమ్మిది మంది నిజంగా ప్రతి విషయంలో శుద్ధులని అనుకుందాం. అటువంటి ఊహ మొదటినుండే పూర్తిగా అసంభవం; కాగా దాని విపర్యయమే నిజమైయుంటుంది, అది కూడా చాలా అరుదుగా. అయినా కాని మనం ఆ విధంగా అనుకుందాం.

ఆ ఒక్కడు, ముప్పైయ్యవవాడు, బయటకు పూర్తి ఔచిత్యంగా ప్రవర్తించినా, అతడు చూసిన దాని ద్వారా ప్రేరేపించబడి, అశుద్ధమైన ఆలోచనలు కలిగియున్నాడు. ఈ ఆలోచనలు సూక్ష్మపదార్థంలో తక్షణమే సజీవమైన ఆలోచనరూపాలుగా రూపుదాల్చి, చూడబడుతున్న అంశం వైపునకు పోతాయి మరియు దానికి అతుక్కుంటాయి. దాని ద్వారా ఎటువంటి వ్యాఖ్యలు కాని లేక తగని చేష్టలు కాని చోటుచేసుకొన్నా లేక చోటుచేసుకొనకపోయినా, అది కల్మషమే!

ఆ విధంగా మలినపరచబడిన వ్యక్తి ఆ మలినాన్ని తనవెంట మోస్తూవుంటాడు. అది తనను పోలినట్టి, గురిలేకుండా సంచరించే ఆలోచనరూపాలను ఆకర్షించుటకు సామార్థ్యతను కలిగియుంటుంది. తద్వారా అది ఆ వ్యక్తిచుట్టూ క్రమంగా దట్టమౌతూవుంటుంది, చివరకు అది ఆ వ్యక్తిని కలవరపెట్టవచ్చు మరియు విషపూరితం చేయవచ్చు, ఏ విధంగా పరాన్నజీవియైన ఒక పాకుడుతీగ తరచుగా అత్యంత ఆరోగ్యవంతమైన వృక్షమును ఎండిపోజేస్తుందో అదే విధంగా.

సందేహాస్పదమైన “నిరపాయమైన” కుటుంబ స్నానశాలలు, సామాజిక ఆటలు, నృత్యములు లేక అటువంటి ఎన్నోవాటివల్ల కలిగే సూక్ష్మపదర్థ ప్రక్రియలు ఈ విధంగా ఉంటాయి.

కాని తప్పక గుర్తుంచుకొనవలసిందేమిటంటే, ఇటువంటి స్నానశాలలకు మరియు వినోదాలకు, అటువంటి ప్రదర్శనల ద్వారా తమ ఆలోచనలను మరియు భావాలను ప్రత్యేకంగా రేకెత్తించగల వాటికొరకై ఎవరు కాంక్షిస్తున్నారో సరిగ్గా అటువంటి వారే ఖచ్చితంగా పోతారు! స్థూలపదార్థంలో బయటకు ఏమాత్రం గమనించబడకుండానే ఎటువంటి కల్మషము దాని ద్వారా ఉత్పాదించబడుతుందో వివరించుట కష్టము కాదు.

నిత్యం పెరిగే మరియు దట్టమయ్యే ఈ ఇంద్రియ-భావాలోచన-రూపాల మేఘాలు క్రమంగా అటువంటి విషయాలను స్వయంగా కాంక్షించని లెక్కలేనంతమంది మనుష్యులపై తప్పక పనిచేయుట కూడా అంతే సహజమైనది. వారిలో మొదట బలహీనంగా, ఆ తరువాత మరింత బలంగా మరియు సజీవంగా అనురూపమైన ఆలోచనలు ఉద్భవిస్తాయి. అవి నిత్యము తమ పరిసరాలలొ “అభివృద్ధి” అని పిలువబడే పలురకాల వాటి ద్వారా పోషించబడతాయి. ఆ విధంగా ఒకరి తరువాత మరియొకరు ఆ చిక్కటి నల్లటి ప్రవాహంలోనికి జారిపోతారు. నిజమైన శుద్ధత్వమును మరియు నీతిని అవగాహన చేసుకొనే సామర్థ్యత దానిలో క్రమంగా మసకబారుతుంది మరియు చివరకు సమస్తం సంపుర్ణ అంధకారంలోనికి లాగివేయబడుతుంది.

ప్రబలమయ్యే అటువంటి వైపరీత్యాలకు ఉన్నటువంటి ఈ అవకాశాలు మరియు ప్రేరణలు తొలగించబడాలి! అవి, దుర్నీతిపరులైన మానవ తెగులు పురుగులు తమ ఆలోచనలు దేనిలో పడవేయవచ్చో వాటి ఆలవాలం తప్ప మరేమీకాదు. అవి తరువాత ఏపుగా ఎత్తుకు ఎదుగుతాయి మరియు నాశనం కలుగజేస్తూ, సమస్త మానవాళిని ఆవహిస్తాయి; అవి క్రమంగా క్రొత్త ఆలవాలములను ఉద్భవింపజేస్తూ, చివరకు ఒకే ఒక అతిపెద్ద జుగుప్స కలిగించే మొక్కల క్షేత్రాన్ని తయారుచేస్తాయి; వాటినుండి విషపూరితమైన గాలి వీస్తుంది; అది మంచిదానిని కూడా ఊపిరాడకుండాచేసి మట్టుబెడుతుంది.

ఈ మత్తులోనుండి మిమ్ములను బయటకు లాగుకోండి; అది ఒక మత్తుమందువలే బలపరుస్తున్నట్లు మభ్యపెడుతుంది, కాని నిజానికి బలహీనపరుస్తూ మరియు నాశనం కలుగజేస్తూ పనిచేస్తుంది!

సరిగ్గా స్త్రీలింగము మరల మొదటిగా అన్ని అవధులను దాటిపోవుట మరియు తన వస్త్రధారణలో విచక్షణలేకుండా పూర్తిగా సిగ్గులేనితనానికి దిగజారుట బాధకరమైనాకాని సహజం.

ఈ విషయము సూక్ష్మపదార్థ కార్యకలాపముల గురించిన వివరణ సరియైనదని రుజువుచేస్తుంది. సరిగ్గా స్త్రీయే, ప్రకృతిసిద్ధంగా మరింత బలమైన తన అంతఃకరణగ్రహణశీలతలో, తెగులుసోకిన సూక్ష్మపదార్థ ఆలోచనరూపాల-లోకంలోనుండి ఈ విషాన్ని, తన స్పృహకు తెలియకుండానే, మొదటిగా మరియు మరింత లోతుగా గ్రహిస్తుంది. ఈ అపాయాలకు ఆమె ఎక్కువగా లోనైయుంటుంది. ఆ కారణంగా మొదటిగా పెడదారిపడుతుంది మరియు గ్రహించలేనంత త్వరగా మరియు ప్రస్ఫుటంగా ప్రతి హద్దును మీరుతుంది.

“ఆడది చెడితే, మగవాడికంటే అధ్వాన్నం!” అని ఊరకనే అనరు కదా: అది ప్రతి విషయానికి వర్తిస్తుంది, అది క్రూరత్వమైనా, ద్వేషమైనా లేక ప్రేమైనా! స్త్రీ యొక్క కార్యం ఎల్లప్పుడు ఆమె చుట్టూవున్న సూక్ష్మపదార్థ లోకం యొక్క ఉత్పాదకమై ఉంటుంది. సహజంగా దానిలో మినహాయింపులు ఉంటాయి. స్త్రీ తద్వారా తన బాధ్యతనుండి మినహాయించబడదు కుడా; కాగా ఆమె తుఫానువలే తనపైకి వచ్చే ప్రభావాలను గమనించగలదు మరియు తన స్వంత సంకల్పమును మరియు కార్యమును తన ఇష్టప్రకారము నడిపించగలదు, ఒకవేళ … ఆమె కోరుకొన్నట్లైతే! వారిలో అధికులు దురదృష్టవశాత్తు ఆ విధంగా చేయకుండుట స్త్రీలింగము యొక్క తప్పు. ఈ విషయాలలోవున్న సంపూర్ణ అజ్ఞానమే దానికి కారణం.

అయినప్పటికిని జాతి యొక్క భవిష్యత్తును కూడా స్త్రీయే తన చేతిలో కలిగియుండుట ప్రస్తుతకాలానికి ఎంతో దురదృష్టకరం. ఆమె దానిని మోస్తుంది, ఎందుకంటే, ఆమె యొక్క ఆత్మీయ స్థితి, సంతతిపై మగవానికంటే మరింత గణనీయమైన ప్రభావాన్ని కలిగియుంటుంది. దాని ప్రకారం ఎటువంటి నీచస్థితిని భవిష్యత్తు తేవలసియుంటుందో! అనివార్యంగా! ఆయుధాలతో, డబ్బుతో లేక ఆవిష్కారాలతో అది ఆపనివ్వదు. మంచితనము ద్వారా లేక రాజ్యతంత్ర చతురత ద్వారా కుడా ఆపనివ్వదు. ఇక్కడ మరింత లోతుగా పనిచేసే సహాయకాలు తప్పక అవసరమైయున్నవి.

ఈ అపారమైన అపరాధం కేవలం స్త్రీపై మాత్రమే పడదు. ఆమె ఎల్లప్పుడు కేవలం తన జాతిపై ఆవరించియున్న ఆలోచనరూపాల లోకం యొక్క నిజమైన ప్రతిబింబమై మాత్రమే ఉంటుంది. దానిని మరువకూడదు. స్త్రీకి స్త్రీగానే గౌరవమర్యాదలు అందించండి. అప్పుడు ఆమె, మీరు ఆమెలో ఏమి చూస్తారో అదే అవుతుంది మరియు ఆ ప్రకారంగానే తనను రూపొందించుకొంటుంది. తద్వారా మీరు మీ జాతి మొత్తాన్ని ఉద్ధరిస్తారు!

కాని దానికి ముందుగా స్త్రీలలో ఒక గొప్ప రూపంతరప్రక్రియ తప్పక జరగవలసియుంటుంది. వారు ప్రస్తుతమున్న స్థితిలో స్వస్థత కేవలం సమూలమైన శస్త్రచికిత్స ద్వారా, ఒక శక్తివంతమైన, కఠినమైన, ప్రతి హానికరమైన ఎదుగుదలను పదునైన కత్తులతో తొలగించి మంటలలో పడవేసే చర్య ద్వారా మాత్రమే కలుగగలదు! లేనిచో అది అన్ని ఆరోగ్యమైన భాగాలను కూడా నాశనం చేస్తుంది.

మానవాళి మొత్తానికి అవసరమైన ఈ శస్త్రచికిత్స దిశగా ప్రస్తుతకాలం వేగంగా, ఆపనలవి కాకుండా సాగుతున్నది, మరింత వేగంగా, ఇంకా వడివడిగా, చివరకు అది స్వయంగా దానిని నెరవేరునట్లు చేస్తుంది! అది బాధకరంగా, భయంకరంగా ఉంటుంది, కాని దాని అంతము స్వస్థతయైయుంటుంది. ఆ తరువాతే నైతికత గురించి మాట్లాడె సమయం వస్తుంది. ఈ రోజైతే అది తుఫానులో మాట్లాడిన మాటవలే, వినిపించక సమసిపోవచ్చు.

అయితే ఎప్పుడు పాపపూరిత బబులోను కుళ్లిపోయి తనకై తాను కూలిపోవడంవల్ల తప్పక నాశనం కావలసిన ఘడియ గడిచిపోతుందో అప్పుడు స్త్రీలింగమును గమనించండి! అది చేసే చర్యలు మరియు అది చేయక వదిలిన చర్యలు మీకు ఎల్లప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని చూపిస్తాయి, ఎందుకంటే అది తన యొక్క మరింత సున్నితమైన అంతఃకరణగ్రహణశీలతలో ఆలోచనరూపాలు దేనిని కాంక్షిస్తాయో దానిని జీవిస్తుంది.

ఈ పరిస్థితి మనకు, ఆలోచనప్రక్రియ మరియు అంతఃకరణగ్రహణశీలత స్వచ్ఛమైనవై ఉన్నప్పుడు, స్త్రీత్వము మొట్టమొదటి దానిగా ఔన్నత్యానికి, అనగా మనము ఉదాత్తమైన మనుష్యులుగా పరిగణించే ఆదర్శానికి, వేగంగా ఉడ్డీనమగునట్లు చేస్తుందనే నిశ్చయతను కలుగజేస్తుంది. అప్పుడు నైతికత తన శుద్ధత్వం యొక్క సంపూర్ణ తేజస్సులో ప్రవేశించియుంటుంది!