పోరాటము

రెండు ప్రపంచ దృక్పథాల యొక్క తీవ్రమైన ఘర్షణ గురించి మాట్లాడగల్గుట ఇప్పటివరకు సరియైనదైయుండలేదు. అందువల్ల మేధస్సు-మనుష్యులకు మరియు ఆసక్తిగల సత్యాన్వేషకులకు మధ్య వాస్తవంగా సంభవిస్తున్న దానికి పోరాటం ఒక తప్పుగా ఎంచుకొనబడిన పదం.

ఇప్పటివరకు సంభవించినదంతయూ మేధస్సు మనుష్యుల ఏకపక్షమైన దాడులతో నిండియుండింది. ప్రతి ప్రశాంత పరిశీలకునికి అవి స్పష్టంగా కారణరహితమైనవిగా మరియు తరచుగా హాస్యాస్పదమైనవిగా తప్పక కనిపించ వలసియుంటుంది. స్వచ్ఛమైన ఆత్మీయతలో మరింత ఉన్నతమునకు అభివృద్ధిచెందుటకు ప్రయత్నించుచున్న వారందరికి వ్యతిరేకంగా అవహేళన, శత్రుత్వము మరియు అత్యంత తీవ్రమైన హింస కూడా ఉంటాయి, వారు ప్రశాంతమైన నిగ్రహాన్ని పాటించినా కూడా. ఊర్ధ్వానికి ప్రయాసపడే అటువంటి వారిని ఎగతాళిచేస్తూ లేక హింసిస్తూ వెనుకకులాగేవారు మరియు జనసందోహం యొక్క మాంద్యంతోకూడిన అచేతనత్వంలోనికి లేక కపటనటన లోనికి లాగేవారు ఎల్లప్పుడు కొందరుంటారు.

ఆ విధంగా చాలామంది అనివార్యంగా నిజమైన మృత్యుసాక్షులు కావలసియుండింది, ఎందుకంటే కేవలం గొప్ప జనసందోహమే కాక దానితోపాటు భూలోకాధికారం కూడా మేధస్సు మనుష్యుల పక్షాన ఉండింది. వీరు ఏమి అందించగలరో అనునది స్పష్టంగా “మేధస్సు” అనే పదంలోనే ఇమిడియున్నది. అది పూర్తిగా భూలోక సంబంధమైన వాటికి మాత్రమే, అనగా నిజమైన ఉనికి యొక్క అత్యంత సూక్ష్మమైన భాగానికి మాత్రమే సంకుచితపరచబడియున్న గ్రహణశక్తియైయున్నది.

ఏ మానవాళి యొక్క ఉనికి ప్రధానంగా, మేధస్సు మనుష్యులు తమకై మూసివేసుకొన్న భాగాల ద్వారా సాగుతుందో, ఆ మానవాళికి ఇది ఎటువంటి సంపుర్ణమైన దానిని, ఎటువంటి మంచిదానిని తేలేదనేది సులువుగా అర్థమయ్యే విషయం. ముఖ్యంగా ఎప్పుడు మనం, కేవలం ఒకే ఒక్క సూక్షమైన భౌతికజీవితం సంపూర్ణ ఉనికికి ఒక ముఖ్యమైన మలుపుస్థానమై ఉండవలెననే విషయాన్ని మరియు ఆ జీవితం మేధస్సు-మనుష్యులకు ఏమాత్రమూ గ్రహింపశక్యం కాని ఇతర భాగాలలో నిర్ణయాత్మకమైన దీర్ఘకాలిక ఫలితాలను కలుగజేస్తుందనే విషయాన్ని, పరిగణనలోనికి తీసుకొంటామో అప్పుడు మనకు అది సులువుగా అర్థమౌతుంది.

నిజానికి ఇప్పటికే లోతుగా పతనం చెందిన మేధస్సు-మనుష్యుల యొక్క బాధ్యత తద్వారా బ్రహ్మాండంగా పెరుగుతుంది; అది ఒక భారమైన వత్తిడివలే వారిని వారెన్నుకొన్న లక్ష్యం దిశగా త్వరత్వరగా నెట్టుతుంది, తద్వారా వారు ఎట్టకేలకు తాము మొండిగా మరియు అహంకారంతో సమర్థించిన దాని యొక్క ఫలితాలను అనుభవించునట్లు.

మేధస్సు-మనుష్యులు అంటే తమ స్వంత మేధస్సుకు బేషరతుగా లొంగిపోయినవారు అని అర్థం. ఆశ్చర్యకరంగా వేల సంవత్సరాలనుండి వీరు తమ యొక్క సంకుచితమైన దృఢనమ్మకాలను శాసనం ద్వారా మరియు అధికారం ద్వారా ఎవరైతే వేరొక దృఢనమ్మకం ప్రకారం జీవించగోరుతున్నారో అటువంటి వారిపై కూడా రుద్దుటకు తమకు సంపూర్ణమైన హక్కు ఉన్నదని విశ్వసించారు. పూర్తిగా తర్కవిరుద్ధమైన ఈ అహంకారం మరల కేవలం మేధస్సు-మనుష్యుల సంకుచిత గ్రహణశక్తిలోనే ఉన్నది; అది తనను మరింత ఉన్నతానికి ఎత్తుకొనలేదు. సరిగ్గా ఈ ప్రతిబంధకమే వారికి గ్రహణశక్తి యొక్క సందేహాస్పదమైన ఉన్నతస్థాయిని తెస్తుంది. దాని ద్వారా అటువంటి దురహంకారాలు ఊహలో తప్పక పుట్టవలసియుంటుంది, ఎందుకంటే వారు తాము నిజంగా చివరి ఉన్నతంపై నిలిచియున్నామని నమ్ముతున్నారు. స్వయంగా వారికి ఆ విధంగానే ఉన్నది కూడా, ఎందుకంటే అప్పుడు వారికి వారు దాటలేని హద్దు వస్తుంది.

కాని సత్యమును అన్వేషించేవారిపై, చాలా తరచుగా అర్థంచేసుకొనలేని ద్వేషంలో వారు చేసే దాడులు, దగ్గరగా గమనించినట్లైతే, వాటి వెనుక ఝళిపించబడే చీకటి యొక్క కొరడాను స్పష్టంగా చూపుతాయి. అటువంటి ఘోరమైన విధానాన్ని కొంతవరకైనా క్షమించగల్గుటకు ఆ శత్రుత్వాలలో నీతితోకూడిన సంకల్పం యొక్క జాడను అరుదుగా కనుగొనవచ్చు. చాలా సందర్భాలలో అది ఒక గ్రుడ్డిదైన, ప్రతివిధమైన తర్కము లోపించిన క్రోధమైయుంటుంది. ఆ దాడులను ప్రశాంతంగా పరిశీలించినట్లైతే ఎంత అరుదుగా వాటిలో, నిజంగా నిష్పాక్షికంగా సత్యాన్వేషకుని యొక్క ఉపన్యాసాలను లేక వ్యాసాలను పరిశీలించే ప్రయత్నాన్ని చూపే ఒక వ్యాసం ఉంటుంది.

అవి ఏనాడూ స్వచ్ఛంగా నిష్పాక్షికంగా ఉండియుండలేదనే విషయంలోనే సరిగ్గా ఎల్లప్పుడు ఆ దాడుల యొక్క నిస్సారమైన న్యూనత పూర్తి స్పష్టంగా అగుపడుతుంది! అవి ఎల్లపుడూ సత్యాన్వేషకుని యొక్క వ్యక్తిత్వానికి గోప్యమైన లేక బహిరంగమైన అప్రతిష్ట కారకాలు. ఎవడు తార్కికంగా జవాబునివ్వలేడో కేవలం అటువంటివాడే ఆ విధంగా చేస్తాడు. ఒక సత్యాన్వేషకుడు లేక సత్యమును తెచ్చేవాడు నిజానికి తనను తాను వ్యక్తిగతంగా ఇచ్చుకొనడు, కాని అతడు దేనిని బోధిస్తాడో దానిని తెస్తాడు.

వాక్యము తప్పక పరీక్షించబడవలెను, వ్యక్తి కాదు! ఎల్లప్పుడు మొదట వ్యక్తిని పరీక్షించుటకు ప్రయత్నించి ఆ తరువాత అతని మాటలు వినవలెనో లేదో పరిశీలించుట మేధస్సు-మనుష్యుల అలవాటు. ఇరుకుగా సంకుచిత పరచబడిన గ్రహణశక్తిగల వీరికి అటువంటి బాహ్యపట్టు అవసరము, ఎందుకంటే కలవరపడకుండా ఉండుటకు వీరు బాహ్యపు వాటికి తప్పక అంటిపెట్టుకొని ఉండవలసి యుంటుంది. సరిగ్గా అదే కదా వారు కట్టే డొల్ల కట్టడం; అది మనుష్యులకు తగనిది, అభ్యున్నతికి పెద్ద అడ్డంకియైయున్నది.

ఒకవేళ వారు అంతరంగంలో బలమైన పట్టును కలిగియుండినట్లైతే, వ్యక్తులపై దృష్టియుంచక సరళమైన రీతిలో వస్తుగతంగా మాత్రమే వాదించేవారు. ఆ విధంగా చేయుటకు వారు అశక్తులైయున్నరు. ఉద్దేశపూర్వకంగా కూడా వారు దానిని నివారిస్తారు, ఎందుకంటే క్రమబద్ధంగా జరిగే పోటీలో తాము త్వరగా తమ జీనునుండి పడిపోతామని వారు స్ఫురిస్తారు లేక కొంతమటుకు ఎరిగియుంటారు. తరచుగా పరిహాసపూర్వకంగా వాడబడే “పామరప్రసంగి” లేక “పామరవివరణ” అనే సూచనలు ఎంత హాస్యాస్పదమైన అహంకారాన్ని చూపుతాయంటే, ప్రతి గంభీరమైన మనిషి అంతఃకరణంలో తక్షణమే గ్రహిస్తాడు: “ఇక్కడ ఆ డొల్లను ఏ విధంగానైనా గోప్యంగా ఉంచుటకు ఒక రక్షక ఫలకము మరియు స్వంత శూన్యతను కప్పివేయుటకు ఒక చౌకబారు పేరుపలక ఉపయోగించబడుతున్నవని!”

అది ఎంతోకాలం నిలువలేని ఒక మోటైన వ్యూహమై యున్నది. దాని ఉద్దేశం ఏమిటంటే, ఇబ్బందికరంగా మారగలిగే సత్యాన్వేషకులను, వారి తొటిమనుష్యుల కళ్లయెదుట మొదటినుండే ఒక “అధమ” స్థాయిపై లేక పూర్తిగా హాస్యాస్పదమైన స్థాయిపై నిలుపుట లేక వారిని కనీసం “బూటకుల” వర్గంలో చేర్చుట, తద్వారా వారు ఎటువంటి ప్రధాన్యతను పొందకుండా ఉండుటకు.

అట్లు చేయుట ద్వారా వారు, ఎవరైనా ఆసక్తితో ఆ మాటలను శ్రద్ధతో పరిశీలించుటను నివారించగోరతారు. ఈ విధంగా చేయుటకు కారణం తోటిమనుష్యులు తప్పుడు బోధల ద్వారా ఆంతరంగిక ఉన్నతిలో అడ్డగించబడతారేమో అనే ఆందోళన కాదు కాని ఆధిపత్యాన్ని కోల్పోతామేమోననే ఒక అనిశ్చితమైన భయమైయున్నది, తద్వారా తాము స్వయంగా ఇదివరకటికంటే లోతుగా పరిశీలించుటకూ మరియు ఇప్పటివరకు తాకకూడని దానిగా మరియు సౌకర్యవంతమైన దానిగా ఉండిన దానిలో చాలా భాగాన్ని తప్పనిసరిగా మార్చుటకూ బలవంతపరచబడతామేమోనని.

“పామరుల” గురించి తరచుగా చేయబడే సరిగ్గా ఇదే సూచన మరియు ఎవరైతే తమ బలపరచబడిన, తక్కువగా ప్రభావితం చేయబడిన అంతఃకరణానుభూతి ద్వారా సత్యానికి చాలా చేరువలో నిలిచియుండి, మేధస్సు యొక్క స్తబ్ధరూపాల ద్వారా గోడలు కట్టనివారిని విచిత్రమైన తక్కువ చూపుతో చూచుట, ఒక బలహీనతను కనబరుస్తుంది, దాని ప్రమాదాలు ఏ ఆలోచించగలవాని దృష్టినుండి తప్పించు కొనలేవు. ఎవడు అటువంటి అభిప్రాయాలను గౌరవిస్తాడో, వాడు పక్షపాతం లేని అధ్యాపకునిగా మరియు నాయకునిగా ఉండుటనుండి మొదటినుండే మినహాయించబడతాడు; కాగా అతడు దేవునినుండి మరియు ఆయన కార్యంనుండి ప్రతి ఇతరునికంటే చాలా ఎక్కువ దూరంలో ఉంటాడు.

మతాల అభివృద్ధిని, దానికితోడైయున్న అన్ని తప్పులను మరియు పొరపాట్లను గురించిన జ్ఞానం మనుష్యులను తమ దేవునికి చేరువగా తేదు. అదే విధంగా, బైబిలు యొక్క లేక వివిధ మతాల ఇతర విలువైన లేఖనాల యొక్క మేధస్సు ప్రకారం ఇవ్వబడే వివరణ కూడా అంతే తక్కువ ఫలితాన్నిస్తుంది.

మేధస్సు స్థలము మరియు కాలములతో ముడివేయ బడియున్నది మరియు అదే విధంగా కొనసాగుతుంది కూడా, అనగా అది భూమితో ముడిపడి యున్నది. మరొక ప్రక్క, దైవత్వము మరియు అదే విధంగా దేవుణ్ణి మరియు ఆయన చిత్తాన్ని గుర్తించుట కూడా స్థలకాలాలకు మరియు గతించే దానంతటికంటే ఉన్నతమైనవి. ఆ కారణంగా అవి ఇరుకుగా సంకుచితపరచబడిన మేధస్సు ద్వారా ఏనాటికీ గ్రహించబడలేవు.

ఈ సాధారణమైన కారణంవల్ల, నిత్యమైన విలువల విషయంలో వివరణను ఇచ్చుటకు మేధస్సు నియమించ బడలేదు. నిజానికి అది ఒక వైరుధ్యమైయుంటుంది. ఎవడైతే అందువల్ల విషయాలలో విశ్వవిద్యాలయపు అర్హత ప్రాముఖ్యమంటాడో, పలుకుబడిలేని మనుష్యులను చిన్నచూపుతో చూడగోరతాడో వాడు తద్వారా స్వయంగా తన అసమర్థతను మరియు సంకుచితత్వాన్ని ప్రకటిస్తాడు. ఆలోచించే మనుష్యులు తక్షణమే ఆ పక్షపాతాన్ని అంతఃకరణంలో పసిగట్టి ఎవడైతే ఆ విధంగా జాగ్రత్త అని హెచ్చరిస్తాడో వాని విషయంలోనే జాగ్రత్తను పాటిస్తారు!

కేవలం పిలువబడినవారు మాత్రమే నిజమైన ఉపాధ్యాయులుగా ఉండగలరు. పిలువబడినవారు అంటే తమయందు సామర్థ్యతను కలిగియున్నవారు. అయితే ఈ సామర్థ్యాలు విశ్వవిద్యాలయ శిక్షణను అడుగవు, కాని స్థలకాలాలకంటేపైకి, అనగా భూలోకమేధస్సు యొక్క అవగాహన హద్దులు దాటి పైకిపోగలిగే సామర్థ్యతగల, సున్నితపరచబడిన అంతఃకరణానుభూతి యొక్క స్పందనలను అడుగుతాయి.

అంతేగాక అంతరంగంలో స్వతంత్రుడైన ప్రతిమనిషి ఒక విషయాన్ని లేక బొధను ఎల్లప్పుడు అది ఏమి తెస్తుంది అనే దానినిబట్టే విలువకడతాడు కాని ఎవరు తెచ్చారు అనే దానినిబట్టి కాదు. ఆ చివరిది విలువకట్టేవాని అసమర్థతకు అత్యంత బలమైన రుజువు. బంగారు బంగారే, అది ఒక రాకుమారుని చేతిలోవున్నా లేక ఒక భిక్షకుని చేతిలోవున్నా.

కాని సరిగ్గా ఆత్మీయ మనుష్యుని యొక్క అత్యంత విలువైన విషయాలలో, ఈ తిరస్కరించలేనటువంటి వాస్తవాన్ని మొండిగా దాటివేయుటకు మరియు మార్చుటకు మనుష్యులు ప్రయత్నిస్తారు. సహజంగా బంగారు విషయంలో లాగే అంతే తక్కువ సఫలతతో. కాగా నిజంగా పట్టుదలతో వెదికేవారు, స్వయంగా ఆ విషయాన్ని పరీక్షించుటలో, అటువంటి ఏకాగ్రతను భంగపరచేవాటి ద్వారా తాము ప్రభావితం చేయబడకుండా చూసుకొంటారు. అయితే, ఎవరు తద్వారా తమను ప్రభావితం చేయనిస్తారో వారు సత్యాన్ని పొందుటకు ఇంకా పరిపక్వం కాలేదు. అది వారికొరకు కాదు.

కాని ఇప్పటివరకు లోపించిన, ఇప్పుడు తప్పక ప్రారంభం కావలసిన పోరాటం యొక్క ఘడియ ఎంతొదూరం లేదు. పక్షపాతం అంతమౌతుంది, తీవ్రమైన పోరాటం దానిని అనుసరిస్తుంది. అది ప్రతి తప్పుడు అహంకారాన్ని నశింపజేస్తుంది.