వెదుకుతూ చాలామంది మనుష్యులు తమ దృష్టిని వెలుగువైపునకు మరియు సత్యమువైపునకు మరల్చుతారు.వారి కోరిక పెద్దదే,కాని వారికి అతి తరచుగా పట్టుదలతోకూడిన సంకల్పం లోటైయుంటుంది!అన్వేషకులలో సగంకంటే ఎక్కువమంది నిజమైన అన్వేషకులు కారు.వారు తమ స్వంత,ముందే ఊహించుకొనబడిన అభిప్రాయాన్ని తెచ్చుకొంటారు.దానిలో ఏ కొంచెమైనా వారు మార్చవలసియున్నట్లైతే అప్పుడు వారు,తమకు క్రొత్తదైన సమస్తాన్ని,దానిలో సత్యం ఉన్నాకాని,తిరస్కరిస్తారే కాని తమ అభిప్రాయాన్ని మార్చరు.
వేలమంది దాని ద్వారా తప్పక మునిగిపోవలసియుంటుంది, ఎందుకంటే వారు పెడ విశ్వాసం యొక్క చిక్కులోపడి పైకి ఎగయుట ద్వారా రక్షణపొందుటకు వారికి అవసరమైన చలన-స్వాతంత్ర్యాన్ని కట్టివేశారు.
సరియైన దానినంతటినీ పూర్తిగా గ్రహించామని అనుకొనే కొంతమంది నిత్యం ఉంటారు. వినినవాటి ప్రకారం మరియు చదివినవాటి ప్రకారం తమను ఖచ్చితంగా పరీక్షించుకొనుటకు వారు ఉద్దేశించరు.
సహజంగా అటువంటి వారికొరకు నేను మాట్లాడడం లేదు.
నేను చర్చిలతోకాని మరియు రాజకీయ పార్టిలతోకాని, సౌభ్రాత్రములతోకాని, తెగలతోకాని మరియు సంఘాలతోకాని మాట్లాడడం లేదు, కాని అతి సరళత్వంలో మనిషితోనే మాట్లాడుతున్నాను. నిలిచియున్న దానిని పడగొట్టుట నాకు దూరంగా ఉండునుగాక; ఎందుకంటే నేను నిర్మిస్తున్నాను మరియు కొద్దిగా ఆలోచించిన తక్షణమే ప్రతివానిలో తలెత్తే ఇంకా జవాబు ఇవ్వబడని ప్రశ్నలకు సమాధానాలను పూరించుచున్నాను.
ప్రతివానికి కేవలం ఒకే ఒక్క మూలమైన నిబంధన అనివార్యమైయున్నది: పట్టుదలతో సత్యముకొరకు వెదకుట. అతడు ఈ మాటలనే తనలో పరీక్షించవలెను మరియు సజీవం కానివ్వవలెను, కాని ఉపన్యాసకున్ని గమనించకూడదు. లేనియెడల అతనికి ఎటువంటి లాభం చేకూరదు. అట్లుచేయుటకు ఆకాంక్షించని వారందరికి కాలాన్ని వెచ్చించుట మొదటినుండే వ్యర్థమైయుంటుంది.
ఎంత అమాయకంగా మనుష్యులందరిలో అత్యధికులు వారు ఎక్కడనుండి వచ్చారు, వారు ఏమైయున్నారు, వారు ఎక్కడికి పోతారు అనే విషయాలలో మొండిగా అజ్ఞానంలోనే కొనసాగగోరుట నమ్మశక్యం కానిది!
సమస్త భూలోకజీవనం యొక్క రెండు విడదీయరాని ధృవాలైన జననం మరియు మరణం మనుష్యులకు మర్మంగా ఉండరాదు.
మనిషి యొక్క అంతరాంతరాలను వివరించగోరే యోచనలలో బలమైన వైరుధ్యాలున్నాయి. అది భూలోకపౌరుల రోగగ్రస్తమైన మహత్వోన్మాదం యొక్క పర్యవసానమైయున్నది. వారు అహంకారంలో తమ అంతరాంతరాలు దైవసంబంధమైనవి అని ప్రజ్ఞలు పలుకుతారు!
మనుష్యులను చూడండి! వారిలో దైవసంబంధమైన దానిని మీరు కనుగొనగలరా? ఆ బుద్ధిలేని వాదనను తప్పక దైవదూషణ అనవలసియుంటుంది, ఎందుకంటే దాని అర్థం దైవత్వాన్ని భ్రష్టము చేయుటయే.
మనిషిలో ఒక్క ధూళికణమంత దైవత్వం కూడా లేదు!
ఈ తలంపు కేవలం రోగగ్రస్తమైన అహంకారమే; అర్థంచేసుకొనగల్గుట అసాధ్యమనే స్పృహ మాత్రమే దీనికి కారణమైయున్నది. ఆ విశ్వాసం తనకు దృఢనమ్మకం అయిందని నిజాయితీగా చెప్పగలిగే మనిషి ఎక్కడ ఉన్నాడు? ఎవడు మనస్ఫూర్తిగా తన అంతరంగాన్ని పరీక్షించుకొంటాడో వాడు దానిని తిరస్కరించవలసియుంటుంది. దైవత్వాన్ని తనలో కలిగియుండుట అనేది కేవలం వాంఛ, కోరికయే తప్ప నిశ్చయత కాదని అతడు స్పష్టమైన అనుభూతిని పొందుతాడు! మనిషి తనలో ఒక దైవమిణుగురును కలిగియుంటాడని అనుట చాలా సరియైనది. అయితే దేవుని యొక్క ఈ మిణుగురు ఆత్మయైయున్నది! అది దైవత్వం యొక్క భాగం కాదు.
మిణుగురు అనే పదం చాలా సరియైన సంబోధన. మిణుగురు అభివృద్ధిచెంది, ఉత్పాదకుని యొక్క గుణంనుండి ఏమియూ తీసుకొనిపోకుండానే లేక తనలో కలిగియుండకుండానే బయటకు ఎగురుతుంది. అదే విధంగా ఈ విషయంలో కూడా. దేవుని మిణుగురు స్వయంగా దైవత్వం కాదు.
ఎక్కడ అటువంటి తప్పులను ఒక ఉనికి యొక్క మూలం విషయంలోనే కనుగొనవచ్చో, అక్కడ సమస్త పరిణామంలో వైఫల్యము తప్పక రావలసియుంటుంది! నేను అనువుగాలేని పునాదిపై నిర్మించియుంటే, ఎదో ఒకనాడు ఆ సంపూర్ణ కట్టడం తప్పక అస్థిరతలో కూలిపోవలసియుంటుంది.
మూలమే కదా ప్రతియొక్కని సమస్త ఉనికికి మరియు అభివృద్ధికి ఆధారాన్ని ఇచ్చేది! ఎవడైతే తరచుగా జరుగుతున్నట్లు ఉనికికి చాలా అవతల పట్టుకొనుటకు ప్రయత్నిస్తాడో వాడు తనకు గ్రహింపశక్యం కాని దానిని అందుకొనుటకు ప్రయత్నిస్తాడు మరియు తద్వారా పూర్తిగా సహజమైన పరిణామ ప్రక్రియలో ప్రతి అధారాన్ని కోల్పోతాడు.
ఒకవేళ నేను, ఉదాహరణకు, భూలోకసాంద్రత ప్రకారం నా భౌతికశరీరంతో సజాతీయతను కలిగియున్న ఒక చెట్టుకొమ్మను పట్టుకొన్నట్లైతే, ఆ కొమ్మలో నాకు పట్టుదొరుకుతుంది మరియు నేను పైకి ఎక్కవచ్చు.
కాని నేను ఆ కొమ్మ అవతల పట్టుకొన్నట్లైతే, గాలి యొక్క వేరొక రకమైన సాంద్రతలో నాకు ఎటువంటి పట్టు కూడా దొరకదు మరియు … అందువల్ల పైకి ఎక్కలేను! అది స్పష్టమైన విషయమే కదా.
మనుష్యుని అంతఃకరణం, దేనిని జీవం అనియూ మరియు దాని అంతరాంతరాలను ఆత్మ అనియూ అంటరో, ఆ విషయంలో కూడా సరిగ్గా ఇదే విధంగా ఉన్నది.
ఈ ఆత్మ, తన మూలంనుండి తనకు అవసరమైయున్న, విధాయకమైన ఆధారాన్ని కోరుకొన్నట్లైతే, సహజంగా అది దానిని దైవతలో పట్టుకొనుటకు ప్రయత్నించరాదు. అప్పుడు అది అసహజం అవుతుంది; ఎందుకంటే దైవత దానికంటే చాలా ఎత్తున ఉన్నది, పూర్తిగా వేరైన సాంద్రతను కలిగియున్నది!
అయిననూ మనిషి తన అహంకారంలో తాను ఏనాటికీ చేరుకోలేని ఆ స్థానంతో సంపర్కాన్ని ప్రయత్నిస్తాడు మరియు తద్వారా ప్రకృతిసిద్ధమైన కలాపానికి అంతరాయాన్ని కలుగజేస్తాడు. అతని తప్పుడు కోరిక ఒక అడ్డుకట్టవలే అతనికి మరియు మూలంనుండి అతనికి ఆవశ్యకమైన శక్తిప్రవాహానికి మధ్య అడ్డు నిలుస్తుంది. అతడు స్వయంగా తనను దానినుండి తెంపివేసుకొంటాడు.
అందువల్ల అటువంటి తప్పులను దూరపరచండి! కేవలం అప్పుడే మనుష్యాత్మ, అది నేడు నిర్లక్ష్యంతో ఖాతరుచేయని తన సంపూర్ణశక్తిని అభివృద్ధిచేయగలదు మరియు అది దేనిగా కాగలదో మరియు కావలసియున్నదో, అటువంటి దానిగా, సృష్టిలో ప్రభువుగా అవుతుంది! కాని ముఖ్యంగా గమనించవలసిందేమిటంటే, సృష్టిలో మాత్రమే, సృష్టి పైన నిల్చుండికాదు.
కేవలం దైవత్వం మాత్రమే సమస్త సృష్టిపైన నిలిచియున్నది. –
సమస్త ఉనికికి మరియు జీవానికి మూలమైయున్న దేవుడు, ఆ పదం సూచిస్తున్నట్లు, దైవత్వమైయున్నాడు! మనిషి ఆయన ఆత్మ ద్వారా సృష్టించబడ్డాడు.
ఆత్మ దేవుని చిత్తమైయున్నది. ఈ చిత్తంలో నుండె మొదటి సృష్టి ఉద్భవించింది. ఈ సాధారణమైన నిజాన్ని గుర్తుంచుకొందాం, ఇది మరింత మెరుగుగా అర్థంచేసుకొనుటకు అవకాశాన్నిస్తుంది.
సరిపోల్చుటకు మీ స్వంత సంకల్పాన్ని ఒకసారి ఊహించుకోండి. అది ఒక కార్యమే, కాని మనిషిలో ఒక భాగం కాదు, లేనిచో మనిషి కాలక్రమేణా తన యొక్క పలు సంకల్పకార్యాలలో తరుగుతూ పూర్తిగా అదృశ్యం కావలసియుంటాడు. అతనిలోనుండి ఏమాత్రమూ మిగులకపోవచ్చు.
దేవుని విషయంలో కూడా అది వేరుగా లేదు. ఆయన చిత్తం పరదేశును సృష్టించింది! అయితే ఆయన చిత్తం ఆత్మయైయున్నది. దానిని “పరిశుద్ధ ఆత్మ” అంటారు. పరదేశు తిరిగి కేవలం ఆత్మ యొక్క కార్యం మాత్రమే, దానిలో ఒక భాగం కాదు. దీనిలో క్రిందిదిశగా ఒక శ్రేణీకరణ ఉన్నది. సృజనాత్మకమైన పరిశుద్ధ ఆత్మ, అనగా సజీవమైన దేవుని చిత్తము ఆయన సృష్టిలో విలీనంకాలేదు. అది తనలోనుండి ఒక భాగాన్ని దానికి ఇవ్వలేదు కూడా, కాని స్వయంగా అది పూర్తిగా సృష్టి బయటఉండిపోయింది. ఈ విషయాన్ని బైబిలు చాలా తేటగా మరియు స్పష్టంగా ఈ మాటలతో చెబుతుంది: “దేవుని యొక్క ఆత్మ జలముల పైన సంచరించుచుండెను!, దేవుడు వ్యక్తిగతంగా కాదు! ఏది ఏమైనా దానిలో వ్యత్యాసం ఉన్నది. మనిషి ఆ పరిశుద్ధ ఆత్మలోనుండి కూడా తనలో ఏమియూ కలిగియుండడు, కాని కేవలం ఆత్మలోనుండి మాత్రమే; ఆ ఆత్మ పరిశుద్ధ ఆత్మ యొక్క పనియై, ఒక కార్యమైయున్నది.
ఈ వాస్తవాన్ని గురించి పట్టించుకొనుటకు బదులుగా మనిషి ఇప్పటికే తన శక్తియంతటితో ఒక గండిని ఏర్పరచగోరుతున్నాడు. మొదటి సృష్టి గురించి, అనగా పరదేశు గురించి ప్రాచుర్యంలోవున్న భావనను గురించి మాత్రమే ఆలోచించండి. అది అనివార్యంగా ఈ భూమిపై ఉండవలెనట. అల్పమైన మనుష్య మేధస్సు తద్వారా మిలియన్లకొలది సంవత్సరాలు పట్టిన ఆ ప్రక్రియను స్థలకాలములతో చాలా పరిమితపరచబడిన తన క్షేత్రంలోకి లాగింది మరియు తనను లోకప్రక్రియ సమస్తానికి మధ్య బింధువుగా మరియు ఇరుసుగా ఊహించుకొన్నది. దాని పర్యవసానంగా అతడు తద్వారా అసలైన జీవం యొక్క ప్రారంభస్థానానికి నడిపించే మార్గాన్ని తక్షణమే కోల్పోయాడు.
అతడు ఆపై వీక్షించలేకపోయిన, స్పష్టమైన ఆ మార్గం స్థానంలో, ఒకవేళ అతడు తననే సమస్త ఉనికికి మరియు జీవానికి కారణభూతునిగా మరియు తద్వారా దేవునిగా పిలుచుకొనుటకు ఇష్టపడనట్లైతే, అతని మతసంబంధమైన భావనలలో ఒక ప్రత్యమ్నాయం కనుగొనబడవలసి వచ్చింది. ఈ ప్రత్యమ్నాయాన్ని అతనికి ఇంతవరకు “నమ్మకం” అనే వ్యక్తీకరణ ఇచ్చింది! మరియు “నమ్మకం” అనే ఈ పదం వలన అప్పటినుండి సమస్త మానవాళి రోగగ్రస్తమయింది. అంతేగాక, అపార్థం చేసుకొనబడిన, తప్పిపోయిన దానినంతటిని పూరించవలసిన ఈ పదం ఒక కొండ అయింది, దానిని ఢీకొని సమస్తం విఫలమయింది.
నమ్మకంతో ప్రతి సోమరివాడు మాత్రమే తృప్తిపడతాడు. పరిహాసకులు ఆసరాగా తీసుకొనగలిగేది కూడా ఆ నమ్మకమే. మరియు తప్పుగా వివరించబడిన “నమ్మకం” అనే పదమే నేడు మానవాళి యొక్క పురోగమన మార్గాన్ని ఆటంకపరుస్తూ నిలిచియున్న అడ్డంకి.
నమ్మకము, ఒక నిద్రరోగంవలే ఇమ్ముగా వైకల్యపరుస్తూ మనిషి ఆత్మపై క్రమ్ముకొనే సమస్త ఆలోచన యొక్క సోమరితనాన్ని ఉదారతతో దాచే తొడుగు కారాదు! నమ్మకం నిజానికి దృఢనమ్మకం కావలెను. అయితే దృఢనమ్మకము సజీవతను, అత్యంత నిశితంగా పరీక్షించుటను అపేక్షిస్తుంది!
ఎక్కడ ఒకే ఒక్క సందుకాని, ఒకే ఒక్క విడుపు చేయబడని పొడుపుకథకాని మిగిలియుంటాయో, అక్కడ దృఢనమ్మకము అసంభవమౌతుంది. అందువల్ల ఏ మనిషి కూడా, అతనిలో సమాధానం ఇవ్వబడని ఒక ప్రశ్న మిగిలియున్నంతవరకు, తనలో నిజమైన నమ్మకాన్ని కలిగియుండలేడు.
కేవలం “గ్రుడ్డి నమ్మకం” అనే మాటలోనే అనారోగ్యతను గుర్తించవచ్చు!
నమ్మకము, క్రీస్తు ఒకానొకప్పుడు అపేక్షించినట్లు తప్పక సజీవమైనదై ఉండవలసియుంటుంది, లేనిచో దానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అయితే సజీవంగా ఉండుట అంటే తనను తాను చైతన్యపరచుకొనుట, సరితూచుట మరియు పరీక్షించుట కూడా! మూగగా పరుల ఆలోచనలను అంగీకరించుట కాదు. గ్రుడ్డి నమ్మకం అంటే నిజానికి అర్థంకాకపోవడమే కదా. అయితే మనిషి దేనిని అర్థంచేసుకోడో, అది అతనికి ఎటువంటి ఆత్మీయలాభాన్ని చేకూర్చదు, ఎందుకంటే అర్థం చేసుకోనందువల్ల అది అతనిలో సజీవం కాలేదు.
అయితే, దేనిని అతడు తనలో పూర్తిగా అనుభవించడో, అది ఏనాటికీ అతని స్వంతం కూడా కాబోదు! మరియు అతని స్వంతమైనది మాత్రమే అతన్ని ఆరోహింపజేస్తుంది.
ఏది ఏమైనా చివరకు ఎవ్వడూ కూడా, ఒకవేళ మార్గంపై పెద్ద పగుల్లు తెరుచుకొనియున్నట్లైతే దానిపై నడవలేడు, ముందుకు సాగలేడు. మనిషి ఎక్కడ తెలుసుకొంటూ ముందుకు సాగలేడో అక్కడ అతడు ఆత్మీయంగా తప్పక నిలిచిపోవలసియుంటుంది. ఈ వాస్తవం త్రోసివేయబడలేనిది మరియు సులభంగా అర్థంచేసుకోబడగలదు కూడా. ఎవడు ఆత్మీయంగా ముందుకు సాగాలనుకొంటాడో, వాడు మేల్కొనవలెను!
నిద్రలో అతడు సత్యం యొక్క వెలుగునకు నడిపించే తన మార్గాన పోలేడు! కండ్లకు గంతలతో కాని లేక పరదాతో కాని కూడా కాదు.
చూసేవారిగా తన మనుష్యులు ఉండవలెనని సృష్టికర్త కోరుతున్నాడు. అయితే, చూసేవారు అంటే ఎరిగియుండేవారు అని అర్థం! మరియు జ్ఞానానికి ఎటువంటి గ్రుడ్డి నమ్మకం సరిపోదు. కేవలం జడత్వము, ఆలోచన యొక్క సొమరితనము మాత్రమే దానిలో ఉన్నాయి, ఎటువంటి గొప్పతనం కాదు!
ఆలోచనచేయగల్గుట అనే యోగ్యమైన సామర్థ్యత మనిషికి పరీక్షించుట అనే కర్తవ్యాన్ని కూడా తెస్తుంది!
దీనినంతటినీ తప్పించుకొనుటకు మనిషి సోమరితనంలో గొప్ప సృష్టికర్తను ఎంతగా కించపరచాడంటే, అతడు ఆయన యొక్క సర్వశక్తిత్వానికి రుజువుగా ఆయనకు యధేచ్ఛగా చేయబడే కార్యాలను అంటగడతాడు.
ఎవడు కేవలం కొద్దిగా ఆలోచించగోరుతాడో వాడు దానియందు మరల ఒక గొప్ప తప్పును తప్పక కనుగొనవలసియుంటుంది. యధేచ్ఛగా చేయబడే కార్యం, ఉనికిలోవున్న ప్రకృతిశాసనాలను మార్చివేసే సంభావ్యతను సూచిస్తుంది. అయితే, ఎక్కడ అటువంటిది జరుగవచ్చో, అక్కడ సంపూర్ణత లోటైయుంటుంది. ఎందుకంటే ఎక్కడ సంపూర్ణత ఉంటుందో అక్కడ ఎటువంటి మార్పు సంభవించలేదు. దానితో మానవాళిలో అధికభాగం ద్వారా దేవుని యొక్క సర్వశక్తిత్వం ఏ విధంగా చిత్రీకరించబడుతుందంటే, లోతుగా ఆలోచించేవాడు దానిని అసంపూర్ణతకు ఒక రుజువుగా పరిగణించవలసియుంటుంది. మరియు దానిలో చాలా అశుభాలకు మూలం ఉన్నది.
దేవునికి సంపూర్ణత యొక్క గౌరవాన్ని ఇవ్వండి! అప్పుడు మీరు దానిలో సమస్త ఉనికి యొక్క విడుపు చేయబడని పొడుపుకథలకు తాళంచెవిని కనుగొంటారు. –
ఆసక్తితో వెదుకువారిని అంతవరకు తెచ్చుట నా అభిలాషయైయుండవలెను. సత్యాన్ని అన్వేషించే వారందరి గణాలలో ఊరట కలుగవలెను. ఎట్టకేలకు వారు సంతోషంతో, సమస్త లోకకలాపంలో ఎటువంటి మర్మముకాని, ఎటువంటి గండికాని లేదని గుర్తిస్తారు. మరియు అప్పుడు … వారు ఆరోహణకొరకైన మార్గాన్ని స్పష్టంగా తమ ఎదుట చూస్తారు. వారు కేవలం దానిపై పోవలసియుంటుంది. –
సృష్టి సమస్తంలో గూఢత్వానికి ఎటువంటి సమర్థన లేదు! దానిలో గూఢత్వానికి ఏమాత్రం తావులేదు; కాగా మనుష్యాత్మ వెనుకవున్న మూలంవరకు సమస్తమూ స్పష్టంగా మరియు కంతలు లేకుండా దాని ఎదుట ఉండవలెను. కేవలం ఏదైతే దానికంటే పైన ఉన్నదో అది మాత్రం ప్రతి మనుష్యాత్మకు తప్పక అత్యంత పరిశుద్ధమైన రహస్యమై ఉండవలసియుంటుంది. అందువల్ల దైవసంబంధమైనది దాని ద్వారా ఏనాటికీ గ్రహించబడలేదు. అత్యంత మంచిసంకల్పంతో మరియు అత్యంత గొప్ప జ్ఞానంతో కూడా అది సాధ్యంకాదు. ఈ విధంగా దైవత్వంనుండి దేనినీ గ్రహించలేకపోవుట మనిషికి అతడు ఊహించుకొనగలిగే అత్యంత సహజమైన విషయమైయున్నది; కాగా ఏదీ కూడా మనకు తెలిసియున్నట్లు తన మూలం యొక్క మిశ్రమాన్ని దాటిపోలేదు. మనిషి యొక్క ఆత్మ కూడా! వేరొక విధమైన మిశ్రమంలో నిత్యం ఒక హద్దు ఉంటుంది. మరియు దైవత్వం యొక్క సంగతత్వం మనిషి ఉద్భవించే ఆత్మసంబంధమైన దానినుండి పూర్తిగా వేరైనది.
జంతువు ఉదాహరణకు జీవిగా సంపూర్ణంగా అభివృద్ధిచెందినా ఏనాటికీ మనిషి కాలేదు. దాని యొక్క జీవసముదాయతలోనుండి ఎట్టి పరిస్థితులలో మానవాత్మను ఉద్భవింపజేసే ఆత్మికత వికసించలేదు. సమస్త జీవత యొక్క మిశ్రమంలో ఆత్మికత యొక్క మూలజాతి లోటైయున్నది. ఆత్మసంబంధమైన సృష్టిభాగంలోనుండి ఉద్భవించిన మనిషి కూడా అదే విధంగా ఎప్పటికీ దైవత్వాన్ని పొందలేడు, ఎందుకంటే ఆత్మికత దైవికత యొక్క జాతిని కలిగియుండదు. మనుష్యాత్మ సంపూర్ణత యొక్క అత్యంత ఉన్నతస్థాయికి అభివృద్ధి చెందవచ్చు, అయిననూ అది ఎప్పటికీ ఆత్మగానే తప్పక ఉండవలసియుంటుంది. అది తనకంటే ఎత్తునవున్న దైవత్వంలోనికి పోలేదు. వేరొక రకమైన సంగతత్వం సహజంగా ఇక్కడ కూడా పైదిశగా ఎప్పటికీ దాటలేని హద్దును నిర్మిస్తుంది. పదార్థత ఈ విషయంలో అసలు పరిగణనలోకే రాదు, ఎందుకంటే అది ఎటువంటి స్వంత జీవాన్ని తనలో కలిగియుండదు, కాని ఆత్మికత ద్వారా మరియు జీవత ద్వారా ఉత్తేజపరచబడి మరియు రూపొందించబడి తొడుగువలే పనిచేస్తుంది.
ఆత్మ యొక్క మహాగొప్ప క్షేత్రం సృష్టియంతటి ద్వారా వ్యాపించియున్నది. అందువల్ల మనిషి దానిని సంపూర్ణంగా గ్రహించగలడు, గ్రహించవలెను, గ్రహించవలసియున్నది మరియు గుర్తించాలి! మరియు తన జ్ఞానం ద్వారా అతడు దానిలో ఏలుతాడు. కాని నిజంగా గుర్తించినట్లైతే, ఏలుట, అది అత్యంత కఠినమైనదైనా, కేవలం సేవించుటయే.-
సృష్టియంతటిలో, అత్యున్నతమైన ఆత్మికతవరకు, ఏచోట కూడా ప్రకృతిసిద్ధమైన కలాపంలో క్రమభంగం ఉండదు! కేవలం ఆ స్థితే ప్రతి ఒక్కనికి సమస్తాన్ని సుపరిచితం చేస్తుంది. అనారోగ్యకరమైన మరియు రహస్యమైన బెదురు, ఇంకా తెలియని వాటిని గురించి తెలుసుకొనుటకు సంకోచము, స్వతహాగా కూలిపోతాయి. సహజత్వంతో పైరగాలి, గొప్ప కలకలాన్ని సృష్టించగోరే వారి అంధకారబంధురమైన భూతకల్పనల యొక్క ఉబ్బరించే పర్యావరణం గుండా వీస్తుంది. వారి రోగగ్రస్తమైన, బలహీనులకు భీతిగొలిపే, బలవంతులు హేళనచేసే భూతకల్పనలు, స్పష్టమౌతున్న దృష్టిలో హాస్యాస్పదంగా మరియు పిల్లచేష్టలవలే చిల్లరగా కనిపిస్తాయి. ఆ దృష్టి చివరకు, తాజాగా మరియు ఉల్లాసంగా, సమస్త కలాపం యొక్క మహిమపూరిత సహజత్వాన్ని కలిగియుంటుంది. అది ఎల్లప్పుడు సాధారణమైన, స్పష్టంగా గుర్తించబడగలిగే సరళరేఖలలో మాత్రమే కదులుతుంది.
అది ఏకరీతిగా అత్యంత ఖచ్చితమైన క్రమబద్ధతతో మరియు సక్రమంగా సాగుతుంది. మరియు అది ప్రతి అన్వేషకునికి అతని అసలైన ప్రారంభంవరకు, గొప్ప, అడ్డులేని వీక్షణను సులభతరం చేస్తుంది!
దానికొరకు అతనికి ప్రయాసతోకూడిన పరిశొధన మరియు భూతకల్పనల యొక్క అవసరం ఉండదు. ముఖ్యమైనదేమిటంతే, అతడు, అయోమయమైన రహస్యకలాపంలో కొద్దిపాటి అసంపూర్ణ జ్ఞానాన్ని గొప్పగా చూపగోరే వారినుండి దూరంగా ఉండాలి.
సమస్తం కూడా ఎంత సరళంగా మనుష్యుల ఎదుట నిలిచియున్నదంటే, వీరు తరచుగా సరిగ్గా ఈ సరళత్వం వలననే గుర్తింపునకు రారు, ఎందుకంటే వారు మొదటినుండే ఆ గొప్ప సృష్టికార్యం తప్పక ఎంతో కష్టమైనది, క్లిష్టమైనదైయుంటుందని అనుకొంటారు.
అత్యంత మంచి సంకల్పాన్ని కలిగియున్న వేలాదిమంది ఇక్కడ తొట్రపడతారు, తాము కేవలం ఎటువంటి శ్రమలేకుండా తమ ముందు మరియు చుట్టూ చూడవలెనని తెలియక వెదుకుతూ తమ కళ్లను పైకి సారిస్తారు. అప్పుడు వారు, తమ భూలోకమనుగడ ద్వారా తాము ఇప్పటికే సరియైన మార్గంపై నిలిచియున్నామనియూ, కేవలం ప్రశాంతంగా ముందుకు అంగలువేస్తే సరిపోతుందనియూ చూస్తారు! ఎటువంటి తొందరపాటు మరియు ప్రయాసలేకుండా, అయితే తెరిచియున్న కళ్లతో, స్వతంత్రమైన, పక్షపాతంలేని మనస్తత్వంతో! మనిషి ఎట్టకేలకు, నిజమైన గొప్పతనం అత్యంత సరళమైన, అత్యంత సహజమైన కలాపంలో మాత్రమే ఉన్నదని గొప్పతనానికి ఈ సరళత్వం తప్పనిసరి అని నేర్చుకోవలసియుంటుంది.
సృష్టిలో ఆ విధంగా ఉన్నది, సృష్టిలో ఒక భాగంగా దానికి చెందియున్న స్వయంగా అతనిలో కూడా అదే విధంగా ఉన్నది!
కేవలం సరళమైన ఆలోచన మరియు అంతఃకరణానుభూతి మాత్రమే అతనికి స్పష్టతనిస్తాయి. పిల్లలు ఇప్పటికీ కలిగియున్నంత సరళత! ప్రశాంతమైన ఆలోచన అతనికి, గ్రాహ్యసామర్థ్యత విషయంలో, సరళత స్పష్టతతోనూ మరియు సహజత్వంతో కూడా ఒకటైయున్నదనే విషయాన్ని అతడు గుర్తించుటకు తోడ్పడుతుంది! వాటిలో ఒకటి లేకుండా వేరొకదాని గురించి ఆలోచించుట అసాధ్యం. అవి ఒకే భావనను వ్యక్తపరిచే త్రయమైయున్నవి! ఎవడు దానిని తన అన్వేషణకు పునాదిగా చేసుకొంటాడో, వాడు మసకబారిన అయోమయాన్ని త్వరగా ఛెదిస్తాడు. కృత్రిమంగా చేర్చబడినదంతా అప్పుడు శూన్యంలోనికి కూలిపోతుంది.
ఎక్కడకూడా ప్రకృతిసిద్ధమైన కలాపం ఆపివేయబడరాదని, ఏచోటకూడా దానికి అంతరాయం లేదని మనిషి గుర్తిస్తాడు! మరియు దానిలోనే దేవుని గొప్పతనం గోచరమౌతుంది! స్వయంచలిత సృజనాత్మక చిత్తం యొక్క మారని సజీవత్వం కూడా! కాగా ప్రకృతిశాసనాలు దేవుని యొక్క కఠినమైన శాసనాలు, అవి ఎల్లప్పుడు మనుష్యులందరి కళ్ల ఎదుట ఉంటాయి, వారికి హితబోధ చేస్తుంటాయి, సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని గురించి, అచంచలమైన, మినహాయింపులేని క్రమబద్ధతను గురించి సాక్ష్యమిస్తుంటాయి! మినహాయింపులేని! కాగా ఓట్లగింజలలోనుండి ఓట్లే రాగలవు, గోదుమలలోనుండి గోధుమలే, ఇత్యాది.
సృష్టికర్త యొక్క స్వంత కార్యంగా ఆయన సంపూర్ణతకు అతి చేరువలోవున్న మొదటి సృష్టియందు కూడా ఆ విధంగానే ఉన్నది. అక్కడ ప్రాథమిక శాసనాలు ఏ విధంగా నాటబడియున్నాయంటే, అవి చిత్తం యొక్క సజీవత్వం ద్వారా ప్రేరేపించబడినవై, తదుపరి సృష్టి యొక్క ఉద్భవాన్ని క్రిందివరకు, చివరకు ఈ విశ్వగోళాలవరకు అత్యంత సహజమైన కలాపం ద్వారా కలిగించవలసియుండింది. అభివృద్ధి క్రమంలో సృష్టి తనను సంపూర్ణత యొక్క మూలంనుండి దూరపరచుకొనేకొలది అవి కేవలం ముతకగా అవుతూ వచ్చాయి. –
మనం మొదట ఒకసారి సృష్టిని గమనిద్దామా.
దానిలో సమస్త జీవం, అది ఏ భాగంలో ఉన్నాసరే, రెండే రకాలను కలిగియుంటుందని మీరు ఊహించుకోండి. వాటిలో ఒక రకం స్వీయస్పృహను కలిగియున్నది ఇంకొకటి స్వీయస్పృహలేనిది. ఈ రెండు బేధాలను గమనించుట అత్యంత విలువైనది! అది “మనిషి యొక్క మూలానికి” సంబంధించినది. ఈ బేధాలు అభివృద్ధి క్రమానికీ దృశ్యమాన పోరాటానికీ ప్రేరేపణను కూడా ఇస్తాయి. స్వీయ స్పృహలేనిది స్వీయస్పృహగల సమస్తమైన దానికి ఒక తొడుగువంటిది, కాని తన మిశ్రమంలో సంపూర్ణంగా అదే రకానికి చెందినది. స్వీయస్పృహను పొందుట స్వీయస్పృహలేని దానికి పురోగతి మరియు అభివృద్దియైయున్నవి. అది స్వీయస్పృహగలదానితో కలిసియుండుట ద్వారా అదే విధంగా స్వీయస్పృహను పొందవలెనని నిరంతరం ప్రేరణను పొందుతుంది.
స్వయంగా మొదటి సృష్టే క్రిందిదిశగా అభివృద్ధిచెందుతూ ఒకదాని తరువాత ఇంకొకటిగా మూడు గొప్ప మూలవిభజనలను కలుగజేసింది: అన్నింటికంటే ఎగువన ఉన్నది మరియు అత్యంత ఎత్తైనదిఆత్మికత; దానికి అంటుకొని మరింత దట్టంగా మరియు తద్వారా మరింత బరువుగా అయ్యే జీవత ఉంటుంది. చివరిగా అన్నింటికంటే క్రిందిది మరియు అత్యంత గొప్ప సాంద్రతవలన అత్యంత బరువైనది, ఈ గొప్ప పదార్థరాజ్యం; ఇది క్రమక్రమంగా తనను ఆదిసృష్టినుండి వేరుపరుచుకొంటూ క్రిందకు క్రుంగింది! దానిద్వారా చివరకు అన్నింటికంటే పైదానిగా కేవలం ఆదిసృష్టి మాత్రమే మిగిలింది, ఎందుకంటే అది తన స్వచ్ఛమైన రకంలో అత్యంత తేలికైన దానిని మరియు అత్యంత ప్రకాశవంతమైన దానిని మూర్తీభవిస్తుంది కాబట్టి. అదే చాలాసార్లు ప్రస్తావించబడే పరదేశు, సమస్త సృష్టియొక్క కిరీటమైయున్నది.
దట్టమయ్యేది క్రిందకు క్రుంగుతుందనే దానితో మనమప్పుడే గురుత్వాకర్షణ శక్తి శాసనాన్ని ప్రస్తావిస్తున్నాం. అయితే అది పదార్థతలో మాత్రమే నాటబడిలేదు, కాని దాని ప్రభావం సమస్త సృష్టిలో, పరదేశు అనేదానినుండి మొదలై క్రిందికి మనవరకు ఉన్నది.
ఆ గురుత్వాకర్షణ శక్తి శాసనం ఎంత ముఖ్యమైనదంటే, ప్రతిమనిషి దానిని తన మెదడులో నాటుకొనియుండవలెను; కాగా అది మనుష్యాత్మ యొక్క సమస్త పరిణతిలో మరియు అభివృద్ధిప్రక్రియలో ప్రధానమైన తులాదండమైయున్నది.
గురుత్వాకర్షణ శక్తి భూలోక సంగతత్వాలకు మాత్రమే వర్తించదు, కాని భూలోకమానవులు ఇప్పుడు చూడలేనట్టి మరియు అందువల్ల వారు కేవలం ఆవలిలోకం అని సంబోధించే సృష్టిభాగాలలో కూడా అదే విధంగా పనిచేస్తుంది అని నేను ఇప్పటికే చెప్పియున్నాను.
మరింత మెరుగుగా అర్థంచేసుకొనబడుటకు నేను ఈ పదార్థలోకాన్ని ఇంకా రెండు భాగాలుగా విభజించవలసియుంటుంది, సూక్ష్మపదార్థంగా మరియు స్థూలపదార్థంగా. సూక్ష్మపదార్థం అనగా, ఏదైతే తన వేరైన రకంవల్ల భౌతికకంటికి కనిపించలేదో ఆ పదార్థత. అయిననూ అది కూడా పదార్థతయైయున్నది.
“ఆవలిలోకం” అని పిలువబడేదే, వాంఛించబడుతున్నట్టి, స్వచ్ఛంగా ఆత్మికతయైయున్న పరదేశు అని పొరబడరాదు. ఆత్మికతను “ఆలోచనలకు సంబంధించిన దానిగా” అర్థంచేసుకొనరాదు, కాని ఏ విధంగా జీవత మరియు పదార్థతలు కూడా సంగతత్వాలైయున్నాయో అదే విధంగా ఆత్మికత ఒక సంగతత్వమైయున్నది. అయితే మనిషి ఈ సుక్ష్మపదార్థతను సాధారణంగా ఆవలిలోకం అంటాడు, ఎందుకంటే అది భౌతికదృష్టి సామర్థ్యతకు ఆవల ఉన్నది కాబట్టి. అయితే, స్థూలపదార్థత ఈవలిలోకమైయున్నది, అనగా మన స్థూలపదార్థ కళ్లకు సజాతీయత ద్వారా కనబడే భూలోక సమస్తం.
మనిషి తనకు అదృశ్యమైన వాటిని గ్రహించగల్గలేనివిగా, అసహజమైనవిగా పరిగణించుటను విడిచిపెట్టవలెను. సమస్తమూ సహజమైనదే, ఆవలిలోకం అని పిలువబడేది సహితం మరియు దీనినుండి ఇంకా చాలా దూరంలో ఉన్నటువంటి పరదేశు కూడా.
ఏ విధంగా ఇక్కడ మన స్థూలపదార్థ శరీరం తన సజాతీయమైన పరిసరాలకు స్పందించగలదో, తద్వారా వాటిని అది చూడగలదో, వినగలదో మరియు అనుభవించగలదో, అదే విధంగా, ఏ సృష్టిభాగాల యొక్క సంగతత్వం మన దానికి భిన్నంగా ఉంటుందో అక్కడ కూడా ఉంటుంది. ఆవలిలోకం అని పిలువబడే దానిలో సూక్ష్మపదార్థ మనిషి కేవలం తన సజాతీయమైన సూక్ష్మపదార్థపరిసరాలనే పసిగట్టగలడు, వినగలడు మరియు చూడగలడు. ఉన్నతుడైన ఆత్మికమనిషి తిరిగి తనఆత్మికమైన పరిసరాలను మాత్రమే అనుభవించగలడు.
అందువలననే, కొందమంది భూలోకనివాసులు అక్కడక్కడ, తమ సూక్ష్మపదార్థ శరీరంతో, వారు దానిని తమయందు ధరించియున్నారు కాబట్టి, అది స్థూలపదార్థ శరీరంనుండి మరణం ద్వారా వేరుపరచబడక ముందే, సూక్ష్మపదార్థతను చూడగలరు మరియు వినగలరు. దానిలో ఎటువంటి అసహజత్వం కూడా లేదు.
గురుత్వాకర్షణ శక్తి శాసనం ప్రక్కన దానితో పనిచేయుచున్న మరియొక, ఏ మాత్రం తక్కువ విలువైనదికానటువంటి, సజాతి ఆకర్షణ శాసనం కూడా కలదు.
దానితో నేను ఇప్పటికే, ఒక జాతి ఎల్లప్పుడూ తన సజాతీయమైన దానిని మాత్రమే గుర్తించగలదనే విషయాన్ని ప్రస్తావించియున్నాను. “సజాతీయమైనవి ఆకర్షించుకొంటాయి” మరియు “నవరత్నాలన్నీ ఒకచోట, నత్తగుల్లలన్నీ మరోచోట” అనే సామెతలు ఆదిశాసనంనుండి గ్రహించబడినట్లున్నాయి. అది గురుత్వాకర్షణశక్తి శాసనంతోపాటు సమస్త సృష్టి ద్వారా ప్రకంపిస్తుంది.
ఇప్పటికే చెప్పినవాటికి తోడుగా ఒక మూడవ ఆదిశాసనం కూడా ఉన్నది, అది: పరస్పరచర్య శాసనం. అది, మనిషి దేనిని ఒకప్పుడు విత్తియుంటాడో, దానినే తప్పక కోయునట్లు చేస్తుంది. అతడు గోధుమలు విత్తియుంటే జొన్నలు కోయలేడు, ముళ్లను విత్తి మృదువైన మొక్కలను కోయలేడు. ఖచ్చితంగా అదే విధంగా సూక్ష్మపదార్థలోకంలో కూడా ఉన్నది. అతడు చివరకు, ద్వేషాన్ని తనలో కలిగియుండినట్లైతే మంచిని కోయలేడు, ఎక్కడైతే అతడు అసూయను తనయందు బలపరచియుంటాడో అక్కడ సంతోషాన్ని కోయలేడు!
ఈ మూడు మూలశాసనాలు దేవుని చిత్తం యొక్క మూలరాళ్లైయున్నవి! ఇవి మాత్రమే ఒంటరిగా, స్వయంచాలకంగా మనిషికి పారితోషికాన్ని లేక శిక్షను కలుగజేస్తాయి, కనికరంలేని న్యాయంతో! అత్యంత అద్భుతమైన, అత్యంత సున్నితమైన శ్రేణీకరణములలో, ఎంత ఖచ్చితంగానంటే, ఆ మహాగొప్ప లోకకలాపంలో ఒక చిన్న అన్యాయం గురించిన ఆలోచన కూడా అసంభవమైయుంటుంది.
ఈ సాధారణమైన శాసనాల ప్రభావం ప్రతి మనుష్యాత్మను, ఎక్కడైతే అది తన అంతరంగిక దృక్పథం ప్రకారం చెందుతుందో అక్కడకు తెస్తుంది. ఎటువంటి పొరపాటు కూడా ఇక్కడ అసంభవం, ఎందుకంటే ఈ శాసనాల ప్రభావం మనుష్యుల అత్యంత లోతైన అంతరంగిక స్థితి ద్వారా మాత్రమే కలుగజేయబడగలదు, అయితే అది ఎట్టి పరిస్థితులలో అనివార్యంగా కలుగజేయబడుతుంది! ఈ ప్రభావం కలుగజేయబడుటకు మనిషి యందున్నట్టి అంతఃకరణానుభూతుల యొక్క ఆత్మీయశక్తి మీటవలే అవసరమైయుంటుంది! మిగతాదంతా దానిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఈ కారణంగా, మనిషికి కనిపించని లోకంలో అతనికొరకు ఏది అభివృద్దిచెందుతుందో, దేనిలోనికి అతడు తన భౌతికమరణం తరువాత తప్పక ప్రవేశించవలసియుంటుందో దానికి, నిజమైన సంకల్పం మాత్రమే ఒంటరిగా, అనగా మనుష్యుని అంతఃకరణానుభూతి మాత్రమే, నిర్ణయాత్మకమైయుంటుంది.
భ్రమపెట్టుట, తనను తాను మభ్యపెట్టుకొనుట అక్కడ పనికిరావు. అతడు అప్పుడు తన సంకల్పంలోదేనిని విత్తియున్నాడో దానిని తప్పక కోయవలసియుంటుంది! పైగా సరిగ్గా అతని సంకల్పం యొక్క శక్తి లేక బలహీనత ప్రకారం అది ఎక్కువగా కాని లేక తక్కువగా కాని ఇతర లోకాల సజాతీయమైన ప్రవాహాలను ప్రవహింపజేస్తుంది, అవి ఏవైనా సరే, అనగా ద్వేషమైనా, అసూయైనా, లేక ప్రేమైనా. అత్యంత సరళతలో, ఒక అతి సహజమైన ప్రక్రియ, అయినా అది కఠినమైన న్యాయత యొక్క అతి ఖచ్చితమైన ప్రభావం ద్వారా జరుగుతుంది!
ఎవడు ఈ ఆవలిలోక కలాపాలను గురించి లోతుగా ఆలోచించుటకు పట్టుదలతో ప్రయత్నిస్తాడో, వాడు ఎటువంటి ఖచ్చితమైన న్యాయత ఈ స్వయంచలిత ప్రభావంలో ఉన్నదో గుర్తిస్తాడు మరియు దానిలోనే గ్రహింపశక్యంకాని దేవుని గొప్పతనాన్ని కూడా చూస్తాడు. తన చిత్తమును శాసనాల రూపంలో, అనగా సంపూర్ణంగా ఈ సృష్టికి ఇచ్చిన తరువాత ఆయనకు జోక్యంచేసుకొనుటకు అవసరం లేదు.
ఎవడు ఆరోహిస్తూ తిరిగి ఆత్మరాజ్యంలోనికి వస్తాడో, వాడు శుద్ధిచేయబడియున్నాడు; కాగా వాడు దానికి ముందుగా స్వయంచలిత దైవచిత్తం యొక్క మిల్లుల ద్వారా తప్పక పోవలసియుండింది. వేరొక మార్గం దేవుని చెంతకు నడిపించదు. మరియు ఏ విధంగా ఆ మిల్లులు మనుష్యాత్మపై పనిచేస్తాయో అనేది దాని యొక్క అంతకు మునుపటి అంతరంగిక జీవితంపై, దాని స్వీయ సంకల్పంపైఆధారపడియుంటుంది. అవి దానికి మేలుచేస్తూ వెలుగు ఔన్నత్యానికి నడిపించవచ్చు, అదే విధంగా బాధకలిగిస్తూ క్రిందకు, భయంకరమైన రాత్రిలోనికి లాగివేయవచ్చు, అంతేగాక సంపూర్ణ నాశనానికి కూడా ఈడ్చవచ్చు. –
మనిషి గుర్తుంచుకొనవలసిందేమిటంటే, భౌతిక జననం సమయంలో శరీరధారణకు పరిపక్వంచెందిన మనుష్యాత్మ అప్పటికే ఒక సూక్ష్మపదార్థపు తొడుగును లేక శరీరమును, దేనినైతే అది తన సూక్ష్మపదార్థలోకంలోని ప్రయాణంలో ఉపయోగించిందో, దానిని ధరించియుంటుంది. అది దానిని భూలోకమనుగడలో కూడా భూలోకశరీరంతో జతపరిచే లింకువలే కలిగియుంటుంది. గురుత్వాకర్షణశక్తి శాసనం ఇప్పుడు తన ప్రధానమైన ప్రభావాన్ని ఎల్లప్పుడు అత్యంత దట్టమైన మరియు స్థూలమైన భాగంపై చూపుతుంది. అనగా భూలొకమనుగడలో భౌతికశరీరంపైన. ఇది గనుక చనిపోతూ దానినుండి వేరైనట్లైతే సూక్ష్మపదార్థ శరీరం తిరిగి స్వతంత్రమౌతుంది మరియు ఆ క్షణంలో, దాపులేని దానిగా, అప్పటినుండి అత్యంత స్థూలమైన భాగంగా, ఈ గురుత్వాకర్షణశక్తి శాసనానికి లోనైయుంటుంది.
ఆత్మ తన శరీరాన్ని నిర్మించుకొంటుంది అన్నప్పుడు, అది సూక్ష్మపదార్థ శరీరానికి సంబంధించిన విషయంలో నిజమైయున్నది. మనుష్యుని అంతరంగిక స్వభావము, అతని ఆశలు మరియు అతని అసలైన సంకల్పం దానికి పునాదిని వేస్తాయి.
సంకల్పము సూక్ష్మపదార్థాన్ని రూపొందించుటకు శక్తిని కలిగియుంటుంది. నీచమైన దానికొరకైన లేక కేవలం లౌకికసుఖాలకొరకైన తాపత్రయం ద్వారా సూక్ష్మపదార్థ శరీరం దట్టంగా మరియు దానితోపాటు బరువుగా మరియు మబ్బుగా అవుతుంది, ఎందుకంటే, అటువంటి కోరికల నెరవేర్పు స్థూలపదార్థలోకంలో ఉన్నది కాబట్టి. తద్వారా మనిషి తనను తాను స్వయంగా స్థూలమైనదానికి, లౌకికమైనదానికి కట్టివేసుకొంటాడు. అతని ఆశలు సూక్ష్మపదార్థ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి, అనగా అది ఎంత దట్టంగా నిర్మించబడుతుందంటే అది భూలోకసాంద్రతకు సాధ్యమైనంత చేరువగా వస్తుంది. స్థూలపదార్థ భౌతికశరీరం వేరైన తక్షణమే, కేవలం భూలోకంపై మాత్రమే లౌకిక సుఖాలలో మరియు తాపత్రయాలలో పాలుపొందగల్గుటకు అవకాశం ఉంటుంది. ఎవడు వాటిని వాంఛిస్తాడో, వాడు తప్పక గురుత్వాకర్షణశక్తి శాసనం ప్రకారం దిగజారిపోతాడు.
ఎవరి ధ్యాస ప్రధానంగా ఉన్నతమైన మరియు ఉదాత్తమైన వాటిపై కేంద్రీకరించబడియుంటుందో అటువంటి మనుష్యుల విషయంలోనైతే అది వేరుగా ఉంటుంది. ఇక్కడ సంకల్పం స్వయంచాలకంగా సూక్ష్మపదార్థ శరీరాన్ని తేలికగా మరియు దానితోపాటు ప్రకాశవంతంగా చేస్తుంది, తద్వారా అది ఈ మనుష్యుల గాఢమైన వాంఛకు గమ్యంగా ఉన్నటువంటి వాటియన్నింటికి చేరువగా రాగల్గుటకు! అనగా ప్రకాశవంతమైన ఔన్నత్యం యొక్క శుద్ధత్వానికి.
వేరే మాటల్లో చెప్పాలంటే: భూలోకమనిషిలో ఉన్నట్టి సూక్ష్మపదార్థ శరీరం మానవాత్మ యొక్క సంబంధిత గమ్యం ద్వారా అదే సమయంలో ఏ విధంగా సజ్జీకరించబడుతుందంటే, అది భౌతికశరీరం చనిపోయిన తరువాత ఈ గమ్యం వైపుకు ఉద్యమించగలదు, అది ఏ రకమైన గమ్యమైనా సరే, ఇక్కడ ఆత్మ నిజంగా తన శరీరాన్ని నిర్మించుకొంటుంది; కాగా దాని సంకల్పం ఆత్మికమైన దానిగా, సూక్ష్మపదార్థాన్ని తనకు ఉపయోగకరంగా చేసుకొనుటకు తనయందు శక్తిని కూడా కలిగియుంటుంది. ఈ ప్రకృతిసిద్ధమైన ప్రక్రియనుండి అది ఎప్పటికీ తప్పించుకోలేదు. ప్రతియొక్క సంకల్పం విషయంలోనూ అది జరుగుతుంది, అది దానికి ప్రియమైనదా లేక అప్రియమైనదా అనే తేడాలేకుండా. మరియు ఈ రూపాలు, అది తన సంకల్పం ద్వారా మరియు అంతఃకరణానుభూతి ద్వారా వాటిని పోషించినంతకాలం దానికి అంటుకొని కొనసాగుతుంటాయి. అవి, ఆత్మను ప్రోత్సాహిస్తాయి లేక అడ్డుకొంటాయి; గురుత్వాకర్షణశక్తి శాసనానికి లోనైయున్న రకానికి అనుగుణంగా.
అయినప్పటికీ, ఆత్మ తన సంకల్పాన్ని మరియు అంతఃకరణానుభూతిని మార్చినట్లైతే, తక్షణమే క్రొత్త రూపాలు ఉద్భవిస్తాయి, అదే సమయంలో ఇదివరకటివి, సంకల్పం యొక్క మార్పు ద్వారా పోషకం పొందక తప్పక గతించవలసియుంటుంది మరియు నశించవలసియుంటుంది. దానితో మనిషి తన ప్రారబ్ధాన్ని కూడా మార్చివేస్తాడు.
భూలోక లంగరు భౌతికశరీరం చనిపోవుట ద్వారా తెగిపోయినప్పుడు, తద్వారా విడుదలపొందిన సూక్ష్మపదార్థ శరీరం, సూక్ష్మపదార్థ లోకంలో, అనగా ఆవలిలోకం అని పిలువబడే దానిలో, మునిగిపోతుంది లేక ఒక బిరడావలే పైకితేలుతుంది. గురుత్వాకర్షణశక్తి శాసనం ద్వారా అది, ఏ స్థలమైతే సరిగ్గా దానితో సమానమైన బరువును కలిగియుంటుందో ఆ స్థలంలో పట్టియుంచబడుతుంది; కాగా అది అప్పుడు ముందుకు సాగలేదు, పైకికాని లేక క్రిందికికాని. ఇక్కడ అది ప్రకృతిసిద్ధంగా సమస్త సజాతీయతను లేక ఏకమనస్కులైన వారినందరిని కనుగొంటుంది; కాగా, సజాతి సమానమైన బరువును, సమానమైన బరువు సహజంగా సజాతిని నిర్దేశిస్తాయి. అతడు స్వయంగా ఏ విధంగా ఉండియున్నాడో అదే విధంగా అతడు, సమనైజాన్ని కలిగియున్నవారి క్రింద తప్పక బాధపడవలసియుంటుంది లేక సంతోషపడగలడు, అతడు అంతరంగంలో తిరిగి మారునంతవరకు, అతనితోపాటు అతని సూక్ష్మపదార్థ శరీరం కూడా; అది అతన్ని, మారిన బరువు యొక్క ప్రభావం ప్రకారం ఇంకా పైకి లేక క్రిందకు తప్పక నడిపిస్తుంది.
అందువల్ల మనిషి ఫిర్యాదు చేయలేడు, కృతజ్ఞతను చెల్లించవలసిన అవసరం కూడా అతనికి లేదు; కాగా, అతడు పైకి, వెలుగు వైపునకు ఎత్తబడినచో అది అతని స్వీయ సాంద్రతయే, అది అనివార్యంగా పైకి ఎత్తబడుటను కలుగజేస్తుంది; అతడు క్రిందకు, చీకటిలోనికి పడినచో, తిరిగి అది అతని స్థితియే, ఆ స్థితి అతన్ని ఆ ప్రక్రియను అనుసరించుటకు బలవంతపరుస్తుంది.
కాని ప్రతి మనిషి కూడా, ఈ మూడు శాసనాల చర్యయందు ఇమిడియున్న సృష్టికర్త యొక్క సంపూర్ణత కొరకు ఆయనను ప్రణుతించుటకు కారణాన్ని కలిగియున్నాడు. మనుష్యాత్మ తద్వారా నిర్నిబంధంగా తన స్వీయప్రారబ్ధం యొక్క పరిమితిలేని ప్రభువుగా అవుతుంది! ఎందుకంటే అతని నిజమైన సంకల్పం, అనగా వాస్తవమైన అంతరంగిక స్థితి, అతనిని తప్పక ఎత్తబడునట్లు లేక ముంచబడునట్లు చేస్తుంది కాబట్టి.
మీరు ఆ శాసనాల చర్యను సరిగా, ప్రతిదాని చర్యను ఒంటరిగా మరియు వాటి సమిష్టి చర్యను ఊహించుకొనుటకు ప్రయత్నించినట్లైతే, మీరు దానిలో ప్రతియొక్కనికి అంతరంగికస్థితి ప్రకారం పారితోషికం లేక శిక్ష, కృప లేక శాపం కూడా అతి ఖచ్చితంగా కొలువబడియున్నాయని కనుగొంటారు. అది అత్యంత సరళమైన కలాపమైయున్నది మరియు అది మనుష్యుని యొక్క పట్టుదలతో కూడిన ప్రతి సంకల్పంలో ఎప్పటికీ తెగజాలని, ఎప్పటికీ విఫలం కాలేని ఒక రక్షణ తాడును చూపుతుంది. అటువంటి సరళత యొక్క గొప్పతనమే, దానిని గుర్తించే వానిని, సృష్టికర్త యొక్క మహాత్యం ఎదుట బలవంతంగా మోకరిల్లజేస్తుంది!
ప్రతి విధమైన కలాపములో, నా వివరణలన్నింటిలోనూ, మనం ఎల్లప్పుడూ తేటగా మరియు స్పష్టంగా పదే పదే ఈ సరళమైన శాసనాల యొక్క చర్యను ఎదుర్కొంటాం. వాటి యొక్క అద్భుతమైన అన్యోన్యచర్యను నేను ఇంకా ప్రత్యేకంగా వివరించవలసియున్నది.
మనిషి ఈ అన్యోన్యచర్యను తెలుసుకొన్నచో, అతడు దానితో ఆత్మయొక్క వెలుగు రాజ్యానికి, పరదేశుకు నిచ్చెనను కలిగియుంటాడు. అయితే అతడు అప్పుడు చీకటిలోతునకు పోయే మార్గాన్ని కూడా చూస్తాడు!
అతడు స్వయంగా అంగలు కూడా వేయనవసరం లేదు, కాని అతడు స్వయంచలిత యంత్రవ్యవస్థ ద్వారా పైకి ఎత్తబడతాడు లేక క్రిందకు లాగబడతాడు, పూర్తిగా అతడు ఆ యంత్రవ్యవస్థను తనఅంతరంగిక జీవితం ద్వారా తనకొరకు అమర్చుకొన్న ప్రకారం.
ఏ మార్గం ద్వారా ఎత్తుకొనిపోబడవలెనని అతడు ఆశిస్తాడో అనేది అతని నిర్ణయానికే ఎల్లప్పుడు వదిలివేయబడియుంటుంది.
మనిషి ఆ విషయంలో పరిహాసకుల ద్వారా తనను కలవరపెట్టబడనీయరాదు.
అనుమానము మరియు పరిహాసము, సరిగా చూసినట్లైతే, అభివ్యక్తం చేయబడిన కోరికలే తప్ప మరేమీ కాదు. ప్రతి అనుమానస్తుడు కూడా, తనకు తాను పూర్తిగా అనాలోచితంగా, తాను ఏమి కోరుకొంటాడో దానిని అభివ్యక్తం చేస్తాడు. తద్వారా అతడు తన అంతరంగాన్ని పరిశోధకుల చూపులకు బయలుపరుస్తాడు. కాగా, ఖండించుటలోనూ, ప్రతిఘటనలోనూ, సులువుగా గుర్తించగల్గునట్లు లోతున దాగియున్న కోరికలు ఉంటాయి. ఎటువంటి అశ్రద్ధత, ఎటువంటి పేదతనం అక్కడ కొన్నిసార్లు బయటపడుతుందో అనేది దుఃఖకరము లేక గర్హనీయం కూడా, ఎందుకంటే సరిగ్గా దాని ద్వారా మనిషి అంతరంగికంగా తనను తరచుగా ప్రతి అజ్ఞానమైన జంతువుకంటే లోతునకు దిగజార్చుకొంటాడు. అటువంటి వారిపై జాలిపడవలెను, అయితే ఓర్పుచూపకుండా, కాగా ఓర్పుచూపుటకు అర్థం పట్టుదలతోకూడిన పరిశోధనకు బదులుగా సోమరితనాన్ని ప్రోత్సాహించుటయే కదా. పట్టుదలతో వెదకువాడు ఓర్పుచూపుటలో తప్పక చాలా పొదుపుగా ఉండవలసియుంటుంది, లేనిచో అతడు చివరకు తన్ను తానే నష్టపరచుకొంటాడు, ఎదుటి వానికి తద్వారా సహాయం చేయకుండానే.
ఎదుగుతున్న జ్ఞానోదయంతో అతడు ఉత్సాహంతో అటువంటి సృష్టి-అద్భుతం ఎదుటనిలుస్తాడు, తద్వారా తనను స్పృహతో పైకి, వెలుగు ఔన్నత్యములకు, అతడు స్వదేశం అనగలిగే వాటికి ఎత్తబడజేసుకొనుటకు!
Lecture “Errors”, Volume I of “In the Light of Truth – Grail Message” by Abd-ru-shin